
‘వరద’ సద్వినియోగం
అధికారులకు సహకరించాలి
● వరద కాలువ ద్వారా నీటి విడుదల
● నిండుతున్న చెరువులు
● హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
బాల్కొండ: ఎస్సారెస్పీ నుంచి మిగులు జలాలను సద్వినియోగం చేసుకునేందుకు నిర్మించిన వరద కాలువ ప్రస్తుత సంవత్సరం సద్వినియోగమవుతోంది. ఈ వరద కాలువ నిర్మాణం ప్రాజెక్ట్ మిగులు జలాలు గోదావరిలోకి వదలకుండా కాలువ ద్వారా వదిలి నల్గొండ జిల్లాలో 2.2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు చేపట్టారు. కానీ మారిన అనేక పరిణామాల్లో వరద కాలువ ఎస్సారెస్పీ పునరుజ్జీవనానికి రివర్స్ పంపింగ్ కోసం నీటి సరఫరా చేసే కాలువ అయింది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుతుండటంతో 28 రోజుల నుంచి కాలువ ద్వారా నీటి విడుదలను చేపడుతున్నారు. వరద కాలువ ద్వారా విడుదలవుతున్న నీరు సద్వినియోగం అవుతోంది. బాల్కొండ నియోజక వర్గంలోని 16 చెరువులను నింపేందుకు 9 తూంలను ఏర్పాటు చేశారు. 9 చెరువుల తూం ల ద్వారా చెరువులకు నీటి సరఫరా జరుగుతోంది. నియోజక వర్గంలో 1529 ఎకరాలకు సాగునీరు అందుతోంది. వరద కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతుండడంతో వరద కాలువ పరివాహక ప్రాంతంలోని భూగర్భ జలాలు సమృద్ధిగా పెరుగుతాయని రైతులు పేర్కొంటున్నారు.
మధ్యమానేరు నింపేందుకు..
ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా నీటి విడుదలను చేపట్టి మధ్యమానేరు డ్యాం(ఎంఎండీ) నింపుతున్నారు. గత నెల రోజుల వ్యవధిలో 45 టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా వదిలారు. వరద కాలువ 122 కిలోమీటర్ల పొడవున ఉంది. కాలువ మొత్తం 35 తూంలు, 16 చెక్ డ్యాంలు ఉన్నాయి. ప్రస్తుతం అన్నింటికి నీటి సరఫరా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మిగులు జలాలు వరద కాలువ ద్వారా విడుదలవుతున్నాయి. ఎస్సారెస్పీ నీటి వివరాలను తెలుసుకోవడానికి నీటి విడుదల ప్రారంభ సమయంలో ఎంఎండీ ఎస్‌ఈ సుమతి ప్రాజెక్ట్‌కు వచ్చారంటే నీటి ఆవశ్యకత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
వరద కాలువ ద్వారా విడుదలవుతున్న ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని చోట్ల నీటి అవసరం లేక పోవడంతో ప్రస్తుత తూంలను ఓపెన్ చేయలేదు. రైతులు అధికారులకు సహకరించాలి.
– గణేశ్, డిప్యూటీ ఈఈ, వరద కాలువ

‘వరద’ సద్వినియోగం