
గోడకూలి ఒకరి మృతి
భిక్కనూరు: మండల కేంద్రంలో గోడకూలి ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన జాగీర్‌సింగ్(37) రేకుల షెడ్డుల నిర్మాణంతో పాటు షటర్లను తయారు చేస్తూ కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. గత నెలలో కురిసిన భారీ వర్షానికి జాగీర్‌సింగ్ ఇల్లు కూలిపోవడంతో పక్కనే ఉన్న బంధువుల ఇంట్లో ఉంటున్నారు. బుధవారం వేకువజామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్తుండగా వర్షానికి కూలిన ఇంటి గోడ జాగీర్‌సింగ్‌పై పడింది. విషయాన్ని గమనించిన స్థానికులు, కుటుంబీకులు వెంటనే కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు, అంధుడైన ఓ కుమారుడు ఉన్నారు.
రుద్రూర్: మండల కేంద్రంలోని పెద్ద చెరువులో ప్రమాదవశాత్తు గాండ్ల సావిత్రి అలియాస్ సాయమ్మ (52) అనే మహిళ పడి మృతి చెందినట్లు ఎస్సై సాయన్న బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సాయమ్మ మంగళవారం చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి జారి పడిపోయిందని తెలిపారు. బుధవారం చెరువులో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
ఖలీల్‌వాడి: నగరంలోని జడ్పీ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఖిల్లా రోడ్డుకు చెందిన మహేశ్(32) పని నిమిత్తం అశోక్ లీలాండ్ వెహికల్‌పై వస్తున్నాడు. డ్రైవర్ గాటే ఖండూ వాహనాన్ని అతివేగంగా నిర్లక్ష్యంగా నడపడంతో వాహనం వెనకాల కూర్చొని ఉన్న మహేశ్ వాహనం పైనుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతని తలకు తీవ్రగాయం కావడంతో స్థానికులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
నవీపేట: మండలంలోని యంచ శివారులో జరుగుతున్న జాతీయ రహదారి(బీబీ 161)విస్తరణ పనుల కోసం డంప్ చేసిన స్టీల్ నుంచి పీరాజీ అనే వ్యక్తి 2 టన్నులు దొంగిలించినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. పనులు నిర్వహిస్తున్న అనూష ప్రాజెక్ట్స్ లిమిటెడ్ మేనేజర్ పార్థసారధి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

గోడకూలి ఒకరి మృతి