
మృత్యు అంచున చేపపిల్లలు
ఉన్నతాధికారులకు నివేదించాం
బాల్కొండ: జిల్లాలో చేప పిల్లల పంపిణీ ప్రక్రియ సందిగ్ధంలో పడింది. టెండర్ల నిర్వహణలో జాప్యం కారణంగా మత్స్యకారులకు చేపపిల్లల సరఫరా ఆలస్యమవుతోంది. దీంతో ఎస్సారెస్పీ దిగువన ఉన్న జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో చేపపిల్లల సైజు పెరిగి కుండీల్లో ఇమడలేక చనిపోయే ప్రమాదం నెలకొంది.
180 చెరువులు, 65 సంఘాలు..
ఎస్సారెస్పీ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం పరిధిలో నందిపేట్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, మోర్తాడ్, కమ్మర్‌పల్లి మండలాల్లోని 180 చెరువులు, 65 మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత సంవత్సరం 54 లక్షల చేపపిల్లల ఉత్పత్తి లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు. కాగా 30 లక్షల చేప పిల్లలను ఉత్పత్తి చేసి నర్సరీల్లో వేశారు. సాధారణంగా 35–40 ఎంఎం సైజు పెరగగానే చేప పిల్లలను చెరువుల్లో వదలాలి. ఇప్పటి వరకు చేపపిల్లలు మత్స్యసహకార సంఘాలకు చేరలేదు. దీంతో నర్సరీల్లోని చేప పిల్లల సైజు 80–100 ఎంఎంకు చేరుకుంటోంది. తద్వారా నర్సరీ కుండీల్లో చేపపిల్లలకు స్థలం సరిపడక చనిపోయే ప్రమాదం నెలకొంది. మరోవైపు చేపపిల్లలకు దాణా కూడా సరిపోయే పరిస్థితి లేదు. దీంతో చేపపిల్లలు చేతికందకుండా పోతాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టెండర్‌లతో లింకు వద్దు
రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, ప్రాజెక్ట్‌లకు ప్రభుత్వం నీలి విప్లవంలో భాగంగా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుంది. ఇందుకోసం టెండర్లను నిర్వహిస్తారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ చేపపిల్లలను సరఫరా చేస్తారు. అయితే ఇప్పటి వరకు టెండర్లు పూర్తికాలేదు. ఆ టెండర్లకు, ఉత్పత్తి కేంద్రంలోని చేపపిల్లలకు లింకు పెట్టడంతో పంపిణీకి నోచు కోవడం లేదు. టెండర్లు కూడా ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. టెండర్లకు సంబంధం లేకుండా త్వరగా చేపపిల్లలను పంపిణీ చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రంలోని చేప పిల్లలకు సరిపడా దాణా అందించలేకపోతున్నాం. సైజ్ ఎక్కువగా పెరిగినట్లు ఉన్నతాధికారులకు నివేదించాం. ఆదేశాలు రాగానే చేపపిల్లల పంపిణీ చేపడతాం.
– దామోదర్, మత్స్య అభివృద్ధి
అధికారి, పోచంపాడ్
ఉత్పత్తి కేంద్రంలోనే చేప పిల్లలు
సైజు పెరిగి కుండీల్లో ఇమడని వైనం
సరిపడా ఆహారం
అందించలేకపోతున్న అధికారులు
చేప పిల్లలు పంపిణీ చేయాలని
మత్స్యకారుల డిమాండ్
టెండర్ల జాప్యంతో ఇబ్బందులు