
ఓ నాన్న నువ్వెక్కడున్నవే..
సదాశివనగర్: నాన్న నేను మన ఊరికి వస్తున్న.. ఆ క్షేమంగా రా బిడ్డ నీకోసం మేమంతా ఎదురుచూస్తున్నాం అంటూ ఫోన్‌లో ప్రేమగా మాట్లాడిన ఆ తండ్రి ఇక లేడని తెలిసిన ఆ కుమారుడి హృదయం ఎంతో తల్లడిల్లిపోయింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేని ఓ కుమారుడు దుబాయికి వెళ్లి మొదటిసారిగా ఇంటికి వస్తుండడంతో ఆ కుటుంబం ఎంతో సంతోషంతో నిండిపోయింది. మరుసటి రోజు కుమారుడు ఇంటికి చేరుతాడనే కొన్ని గంటల వ్యవధిలోనే మృత్యువు గుర్తు తెలియని వాహన రూపంలో తండ్రిని కబళించింది. ఈ ఘటన సదాశివనగర్ మండలం కుప్రియల్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పద్మాజీవాడి గ్రామానికి చెందిన మ్యాదరి బాలయ్య(53) ఆరేపల్లి శివారులోని ఓ ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి పని ముగించుకొని బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా దారి వెంట రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్న బోధన్ ప్రాంతానికి చెందిన సయ్యద్ బాసిద్‌ను ఢీకొన్నాడు. దీంతో వాహనం అదుపు తప్పి బాలయ్య రోడ్డు పై పడడంతో కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపునకు వస్తున్న గుర్తు తెలియని వాహనం అతనిపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో బాలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ ఢీకొన్న ఘటనలో బాసిద్‌కు గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా బాసిద్ మతిస్థిమితం కోల్పోయి కొంత కాలంగా రోడ్డుపై తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా బుధవారం ఉదయం దుబాయి నుంచి స్వగ్రామానికి చేరిన కుమారుడు శివకుమార్ తండ్రి బాలయ్య మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. డాడీ ఫ్లయిట్ ఎక్కుతున్న అంటే జాగ్రత్తగా రా బిడ్డ అన్నవు.. నువ్వెక్కడున్నవే నాన్న అంటూ ఆ కుమారుడు రోదన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పుష్పరాజ్ పేర్కొన్నారు.
● రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి
● కుమారుడు దుబాయి నుంచి వస్తున్న రోజే ఘటన
● పద్మాజీవాడిలో విషాదం