
సేవ చేసేందుకు ఇష్టం లేక హత్య
బోధన్‌రూరల్: వృద్ధురాలికి సేవ చేసేందుకు ఇష్టం లేని కుటుంబీకులు హత్య చేసిన ఘటన సాలూర మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి బోధన్‌రూరల్ ఎస్సై మచ్చేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సాలూర మండల కేంద్రానికి చెందిన కట్టం నాగవ్వ(65) అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు భర్త, కుమారులు లేకపోవడంతో మరిది చిన్న గంగారాం వద్ద ఉంటోంది. ఆమెకు సేవలు చేసేందుకు ఇష్టం లేని గంగారాం, భార్య, కుమారుడు గొంతు నులిమి హత్య చేశారు. వృద్ధురాలి వద్ద ఉన్న డబ్బు, బంగారం కోసమే నిందితులు హత్య చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నిజామాబాద్ రూరల్: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో మహ్మద్ ఆరిఫ్ బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రూరల్ పీఎస్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన సూరజ్‌రావు(22), అదే కాలనీకి చెందిన ఓ అమ్మాయి గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఆ అమ్మాయి వేరే యువకుడితో ప్రేమలో ఉందని తెలిసి తట్టుకోలేక మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
నిజామాబాద్ రూరల్: మండలంలోని మాధవనగర్ రైల్వే గేటును బుధవారం టాటా ఏఎస్ వాహనం ఢీకొనడంతో మధ్యలో విరిగిపోయింది. ఉదయం 11:30 ప్రాంతంలో రైలు వస్తుందని గేట్‌మన్ గేటు వేస్తుండగా గేటు దాటి త్వరగా వెళ్లాలని నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం గేటును ఢీకొన్నదని గేట్‌మన్ తెలిపారు. గేట్ మధ్యలో విరిగిపోవడంతో సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం తాత్కాలిక గేటు వేసి రైలు వచ్చిన ప్రతిసారి ప్రయాణికులను సిబ్బంది ఆపుతున్నారు. మరమ్మతులు ఇంకా పూర్తికాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.