
నానో యూరియాతోనే అధిక దిగుబడులు
● ఇఫ్కో జాతీయ డైరెక్టర్ మార గంగారెడ్డి
జక్రాన్‌పల్లి : నానో యూరియాతో అధిక దిగుబడులు సాధించవచ్చని ఇఫ్కో జాతీయ డైరెక్టర్ మార గంగారెడ్డి అన్నారు. మంగళవారం జక్రాన్‌పల్లి మండలంలోని కలిగోట్ రైతు వేదికలో ఇఫ్కో నానో యూరియాపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డీఏపీ యూరియాను అధికంగా వినియోగిస్తున్నారని అన్నారు. దీని వల్ల నేల భూసారం దెబ్బ తింటుందన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇఫ్కో నానో యూరియాను వాడితే తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట దిగుబడి వస్తుందన్నారు. యూరియా వాడకాన్ని తగ్గించాలని రైతులకు సూచించారు. ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. ఇఫ్కో సంస్థ ఎల్లప్పుడు రైతులను శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, ఏవో దేవిక, కొలిప్యాక్ సొసైటీ చైర్మన్ నాగుల శ్రీనివాస్, మాజీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మద్దుల రమేశ్, ఇఫ్కో రాష్ట్ర మేనేజర్ కృపా శంకర్, రైతులు పాల్గొన్నారు.