
క్లిక్ చేస్తే.. ఖాతా ఖల్లాస్
ఖలీల్‌వాడి: రోజురోజుకూ సైబర్ మోసాలు పెచ్చరిల్లుతున్నాయి. ఆఫర్ల పేరిట పుట్టుకొస్తున్న ఆన్‌లైన్ మోసాలకు చాలా మంది బలవుతున్నారు. క్లిక్ చేస్తే చాలు ఖాతాలు ఖాళీ అవుతున్నా యి. ఫైల్స్ ఓపెన్ చేసి సైబర్ క్రైమ్‌కు కొందరు గురైతే, ట్రేడింగ్ పేరిట వాట్సాప్‌కు వచ్చే మెసేజ్‌లను క్లిక్ చేసి దగా పడుతున్నారు.
ఆఫర్‌ల పేరిట మోసం
ఫోన్లకు వచ్చే ఆఫర్ల మెసేజ్‌లతో చాలా మంది అత్యాశకు పోయి నష్టపోతున్నారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన యాప్‌లను ఆసరాగా చేసుకొని లింకులు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. కాగా, సైబర్‌మోసాల బారిన పడిన వారిలో అధికంగా చదువుకున్న వారే కావడం గమనార్హం. ప్రధానంగా ట్రేడింగ్ ఎక్స్‌పర్ట్‌లమని ఆన్‌లైన్‌లో పరిచయమవుతారు. కొంత ఇన్వెస్ట్ చేయించి అధిక లాభాలు చూపుతారు. మరింత ఇన్వెస్ట్ చేయించి మాయమవుతారు. ఇంకొందరు సీబీఐ, ఈడీ అధికారులమంటూ ఫోన్ చేసి మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని భయపెడతారు. డిజిటల్ అరెస్టు పేరిట వీడియో కాల్స్ చేసి మీ ఖాతాలోని డబ్బులను ఖాళీ చేస్తారు. మరోవైపు కొరియర్, పార్సిల్ సర్వీస్, ప్రభుత్వ పథకాల పేరిట వచ్చే ఏపీకే ఫైల్స్‌ను ఓపెన్ చేసి చాలా మంది మోసపోవడం గమనార్హం.
ఖాతాల ఫ్రీజ్..
నిజామాబాద్ కమిషనరేట్‌లో పరిధిలో 1 జనవరి 2024 నుంచి 29 జూలై 2025 వరకు మొత్తం 759 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసి వారి ఖాతాల నుంచి రూ. 3.27 కోట్లు రికవరీ చేశారు. కోర్టు ద్వారా బాధితులకు డబ్బులు అందజేశారు.
తీసుకోవాల్సిన జాగ్రతలు
ఆఫర్ల పేరిట గాలం
సెల్‌ఫోన్లకు లింకులు పంపిస్తున్న
సైబర్ కేటుగాళ్లు
రెండేళ్లలో 759 కేసులు..
రూ.3.27కోట్ల రికవరీ
బాధితుల్లో చదువుకున్న వారే అధికం
జూలై 27న బాల్కొండ మండల కేంద్రానికి చెందిన యువకుడిని అమెజాన్ డెలివరీ హబ్ ఏర్పాటు పేరుతో సైబర్ నేరగాడు నమ్మించి రూ.1.71 లక్షలు కాజేశాడు. మోసపోయినట్లు గ్రహించిన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.
జూలై 24న నగరంలోని కోటగల్లీకి చెందిన యువకుడి అకౌంట్ నుంచి ట్రేడింగ్ పేరిట రూ.5.40 లక్షలు విడతల వారీగా బ్యాంక్ ఖాతాల నుంచి విత్‌డ్రా అయ్యాయి. దీంతో సదరు యువకుడు నాల్గో టౌన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు ఆరో టౌన్‌కు, అక్కడి నుంచి ఐదో టౌన్‌కు మారింది.
డిజిటల్ అరెస్ట్‌లు ఉండవు..
స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే లింక్ మెసేజ్‌లను తెరువద్దు. జాగ్రత్తగా ఉంటే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడలేం. డిజిటల్ అరెస్ట్‌లు ఉండవు. బాధితులు అరగంట, గంటలోపు ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930కి లేదా cyber.crime.gov.inకు ఫిర్యాదు చేస్తే రికవరీ చేసే అవకాశం ఉంటుంది.
– వెంకటేశ్వర్లు, సైబర్ క్రైం, ఏసీపీ, నిజామాబాద్
సెల్‌ఫోన్లకు వచ్చే లింకులు నిర్ధారణ అయిన తర్వాతే ఓపెన్ చేయాలి.
గుర్తు తెలియని ఫోన్ నెంబర్ల నుంచి గానీ, వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లు, కాల్స్ లిఫ్ట్ చేసి బ్యాంక్ వివరాలు, ఓటీపీలు, ఆధార్, పాన్‌కార్డుల వివరాలు చెప్పొద్దు.
గంటలోపు ఫిర్యాదు చేస్తే సైబర్ క్రైం పోలీసు లు ఆ లింక్ ద్వారా మోసగాళ్ల బ్యాంక్ ఖాతా లను ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది.
జిల్లా పోలీస్ స్టేషన్లలో రూ. 1000 నుంచి రూ. 7లక్షల వరకు, అంతకు మించి ఉంటే సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.