
వెతల వసతి..
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో సంక్షేమ వసతిగృహాల పరిస్థితి అధ్వానంగా మారింది. మరమ్మతులకు సంబంధించి కేటాయించే ప్రత్యేక నిధులు రెండేళ్లుగా మంజూరుకాకపోవడంతో మరమ్మతులు కరువయ్యాయి. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఇబ్బందులు పడుతూ విద్యార్థులు కాలం గడుపుతున్నారు. మరమ్మతుల కోసం సంబంధిత అధికారులు రెండుసార్లు ఎస్టిమేషన్ వేసి నివేదికలు పంపినా నిధులు మాత్రం మంజూరు కావడం లేదు.
● జిల్లాలోని వసతిగృహాల్లో నెలకొన్న ప్రధాన సమస్య గదులకు, కిటికీలకు తలుపులు లేకపోవడం, బాత్‌రూమ్‌లు అధ్వానంగా మారడం.
● జిల్లా కేంద్రంలోని నాందేవాడలో ఉన్న బీసీ వసతి గృహంలో విద్యార్థుల రూములకు తలుపులు సక్రమంగా లేవు. టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయి.
● నాందేవ్‌వాడలోని ఎస్టీ వసతి గృహంలో తలుపులు సక్రమంగా లేవు. బాత్‌రూమ్‌లకు డోర్‌లు లే కపోవడంతో అట్టలు, పరదాలు ఏర్పాటు చేసి విద్యార్థులు వాడుకుంటున్నారు. వంటగదికి తక్షణ మే మరమ్మతులు చేయాల్సి ఉన్నప్పటికీ నిధులు లేక పాత రేకుల షెడ్డులో కొనసాగిస్తున్నారు.
● గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని వసతిగృహం శిథిలావస్థకు చేరింది. పై పెచ్చులు ఉడిపడుతున్నాయి. తక్షణమే మరమ్మతులు చేపట్టాల్సి ఉంది.
● దుబ్బ ప్రాంతంలోని బీసీ వసతి గృహం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నిధులు లేక మరమ్మతులు చేపట్టకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
● ఆర్మూర్‌లోని బాలికల వసతి గృహంలో మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. వర్షం కురిస్తే గదులు ఊరుస్తున్నాయి.
● బోధన్‌లోని ఎస్సీ వసతి గృహంలో గదులకు, కిటికీలకు తలుపులు లేకపోవడం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
నూతన భవనాలకు మోక్షం లేదు
ఎస్సీ సంక్షేమ వసతిగృహాలకు నూతన భవనాల కోసం గతేడాది రూ.30 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మొత్తం 42 హాస్టళ్లు ఉండగా.. తొమ్మిదిచోట్ల నూతన భవనాలు నిర్మించాలని ఆదేశాలు వచ్చాయి. నందిపేట మండలం అయిలాపూర్ వసతి గృహం అధ్వానస్థితిలో ఉందనే అంశాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి అసెంబ్లీలో లేవనెత్తగా భవనం నిర్మించాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కానీ మిగతా ఎనిమిది భవనాల నిర్మాణానికి మాత్రం అనుమతులు జారీ కాలేదు. అనుమతులు వస్తే నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది.
జిల్లాలో వసతిగృహాలు విద్యార్థులు
ఎస్సీ - 42 6324
బీసీ - 33 2,800
ఎస్టీ - 08 1,480
2024లో నివేదికలు
తక్షణం మరమ్మతులు చేపట్టాల్సినవి..
అధ్వానంగా సంక్షేమ వసతి గృహాలు
మరమ్మతులు మరిచారా?
రెండేళ్లుగా మంజూరుకాని నిధులు
ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
నూతన భవనాలకు నిధులున్నా
నిర్మాణానికి అనుమతిలేదు
2024 మార్చిలో సంబంధిత అధికారులు జిల్లాలోని సంక్షేమ వసతిగృహాలను పరిశీలించి మరమ్మతులకు సంబంధించిన నివేదికలను తయారు చేశారు. ఇందుకు రూ.8 కోట్లు అవసరమని ఉన్నతాధికారులకు విన్నవించారు. మళ్లీ ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో వసతిగృహాల మరమ్మతులకు సంబంధించి నివేదికలు పంపించాలని ఉన్నతాధికారులు ఆదేశించగా.. జిల్లా అధికారులు చేపట్టాల్సిన పనులకు సంబంధించి నివేదికలు రూపొందించి రూ.9 కోట్ల 70 లక్షలు అవసరం ఉంటాయని పేర్కొన్నారు. రెండుసార్లు నివేదికలు అందినా ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు.