
తాడ్వాయిలో వృద్ధురాలి ఆత్మహత్య
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మురళి తెలిపారు. వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన ఎరుకట్ల సాయవ్వ(77) అనే వృద్ధురాలు గత యేడాది నుంచి అర్షమొలలు, వెన్ను నొప్పితో బాధపడుతుండేది. ఎన్ని ఆస్పత్రులలో చూపించినప్పటికీ నొప్పి నయం కాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన సాయవ్వ సోమవారం సాయంత్రం కాలనీలోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రివేళ కుటుంబ సభ్యులు సాయవ్వ కోసం గాలించగా బావిలో మృతదేహం కనబడింది. మరుసటి రోజు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
సిరికొండ మండలంలో ఒకరు..
సిరికొండ: మండలంలోని మెట్టుమర్రి తండాలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. తండాకు చెందిన కేతావత్ తిరుపతి(42) అనే వ్యక్తికి నీల, గోదావరి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం రెండో భార్యతో గొడవ జరగడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవల ఆమె తన భర్తపై ధర్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈక్రమంలో అతడు మద్యానికి బానిసై, మంగళవారం ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి మొదటి భార్యకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.