
ఆలయ శిఖరానికి పూజలు
● ఎస్సారెస్పీ నీటిలో నుంచి తేలిన కుస్తాపురం ఆలయ శిఖరం
డొంకేశ్వర్(ఆర్మూర్): ఎస్సారెస్పీ నీటి మట్టం తగ్గుతుండడంతో కుస్తాపురం రామలింగేశ్వర స్వామి ఆలయ శిఖరం తేలింది. డొంకేశ్వర్ మండలం చిన్నయానం బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం కొన్నేళ్లుగా ముంపులోనే ఉంది. చివరిసారిగా 2019లో గుడి పూర్తిగా తేలగా ఇప్పటి వరకు బయటపడలేదు. నీటి మట్టం తగ్గగా ప్రతి ఏడాది మే నెలలో గుడి శిఖరం తేలేది. కానీ, ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలోనే బయటపడింది. ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా జీజీ నడ్కుడకు చెందిన చిన్న గంగారాంతోపాటు మరికొందరు జాలర్లు తెప్పపై నీటిలో రెండు కిలోమీటర్లు ప్రయాణించి గుడి శిఖరం వద్దకు చేరుకున్నారు. శిఖరానికి సున్నం వేసి కొబ్బరియలు కొట్టి పూజలు నిర్వహించారు.
వేగంగా తగ్గుతున్న నీటిమట్టం
బాల్కొండ: కాలువల ద్వారా ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగా తగ్గుతోంది. ఎండల తీవ్రత పెరగడంతో నీరు భారీగా ఆవిరవుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1062.80(13 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది.
నేటి నుంచి ఎస్సెస్సీ మూల్యాంకనం
నిజామాబాద్ అర్బన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను విద్యాశాఖ అధికారులు పూర్తి చేశారు. నగరంలోని నిర్మల హృదయ పాఠశాలలో ఎస్సెస్సీ మూల్యాంకనం జరగనుంది. రెండు లక్షలకు పైగా జవాబుపత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. అందుకోసం 631 మంది ఏఈలు, 222 మంది స్పెషల్ అసిస్టెంట్లు, 104 మంది సీఈలను నియమించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జవాబుపత్రాల మూల్యాంకనం కొనసాగనుంది.
సాటాపూర్ రైల్వేగేటు మూసివేత
ఎడపల్లి(బోధన్): మండలంలోని సాటాపూర్ రైల్వేగేటును సోమవారం నుంచి తాత్కాలికంగా మూసి వేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్ మరమ్మతులు, అభివృద్ధి పనుల్లో భాగంగా గేటును మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. పనులు పూర్తయిన తరువాత యథావిధిగా వాహనాల రాకపోకలు సాగించవచ్చని తెలిపారు. కాగా, ముందస్తు సమాచారం లేకుండా ఆదివారమే గేటు మూసివేయడంతో ఆయా గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో గేటును తీశారు.
రాష్ట్ర నెట్‌బాల్ సంఘంలో జిల్లా వాసులు
నిజామాబాద్‌నాగారం: హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఆదివారం రాష్ట్ర నెట్‌బాల్ అ సో సియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జిల్లా కార్యవర్గ సభ్యులకు పలు పదవులు దక్కాయి. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వెంకటేశ్వర్‌రావు(తిర్మన్‌పల్లి పాఠశాల పీడీ), రాష్ట్ర జాయింట్ సెక్రటరీలుగా ఎ రమేష్(జన్నెపల్లి పాఠశాల పీడీ), రఘురాం(హస్గుల్ పాఠశాల పీడీ)లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఆలయ శిఖరానికి పూజలు

ఆలయ శిఖరానికి పూజలు