కేసీఆర్‌ను దూషించడం పద్ధతి కాదు..

- - Sakshi

హామీలను అమలు చేయకుంటే నిలదీస్తాం

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి

నిజామాబాద్‌: ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారికి హుందాతనం ఉండాలని, మాజీ సీఎం కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి దూషించడం పద్ధతి కాదని మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బాన్సువాడ సమీపంలోని ఎస్‌ఎంబీ ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం బీఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో 1.8 శాతం తక్కువ ఓట్ల తేడాతో అధికారం కోల్పోయమన్నారు. 20 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మారిస్తే సరిపోయేదన్నారు. 2028లో ప్రజలు బ్రహ్మండమైన మెజారిటీతో బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తారని అన్నారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ నాయకుడు సిగ్గులేకుండా బాన్సువాడ నియోజకవర్గంలో తిరుగుతున్నారని, ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉండి సొంత ఊరిలో పేదలకు ఒక్క ఇల్లు కట్టించలేదన్నారు.

ముందుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయాలన్నారు. చేయకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతు బంధు రూ.15 వేలు ఇంతవరకు ఇవ్వలేదన్నారు. జహీరాబాద్‌ ఎంపీ అభ్యర్థి గెలుపును బాన్సువాడ నియోజకవర్గమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. నిజాంసాగర్‌ నీటి విడుదల విడతల వారీగా జరుగుతుందని, ఎకరం కూడా ఎండిపోకుండా చూస్తానన్నారు.

పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీకి సిద్ధం..
పార్టీ ఆదేశిస్తే జహీరాబాద్‌ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని డీసీసీబీ చైర్మన్‌ భాస్కర్‌ రెడ్డి అన్నారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో కీలకమైన నియోజకవర్గం బాన్సువాడ అన్నారు. ప్రతి కార్యకర్తకు తమ కుటుంబం అండగా ఉంటుందన్నారు. నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి, మోహన్‌నాయక్‌, అంజిరెడ్డి, బద్యా నాయక్‌, నీరజావెంకట్‌రాంరెడ్డి, శ్యామల ఉన్నారు.

ఇవి చదవండి: గ్రామపాలనపై.. ప్రత్యేకాధికారులకు సవాల్‌!

whatsapp channel

Read latest Nizamabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top