న్యూస్రీల్
నిత్యావసరాల ధరలకు రెక్కలు బియ్యం, పప్పులు, కూరగాయలు ప్రియం పెరుగుతూనే ఉన్న చక్కెర ధర కాస్త తగ్గిన వంటనూనెలు
మహిళా చట్టాలపై
అవగాహన ఉండాలి
సారంగపూర్: మహిళా చట్టాలపై పూర్తి అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి పొరిక రవీందర్ అన్నారు. బుధవారం మహిళా చట్టాలు, సైబర్ నేరాలు, బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలపై చించోలి(బి)లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో ఎక్కడ చూసినా మహిళలపై ఆకృత్యాలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయన్నారు. ప్రతీ మహిళ తమకోసం రూపొందించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆడపిల్లలకు చిన్నతనంలో వివాహం చేస్తే అనారోగ్యాలకు గురవుతారన్నారు. కార్యక్రమంలో ఎల్ఏడీసీఎస్ ఛీఫ్ రాజలింగం, డీడబ్ల్యూ వినూత్న, డీఈవో భోజన్న, సర్పంచ్ వన్నెల సాయన్న, తహసీల్దార్ విజయ్కాంత్రావు, ఎస్సై శ్రావణి, సైబర్క్రైమ్ ఎస్సై ముత్యం, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ఎండీ వాహెద్, సఖి కేంద్రం నిర్వాహకురాలు శ్వేతరాణి, తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్: దసరా.. అంటేనే పెద్ద పండుగ. పది రోజుల పాటు అమ్మవారి పూజలు, బతుకమ్మ ఆటలు, కొత్త బట్టల కొనుగోళ్లు, పిండివంటల తయారీ, బంధుమిత్రుల కలయికలు.. ఇలా ప్రతి ఇంటా పండుగ సందడి ఉంటుంది. ఈ ఆనందాల వేళ పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. పండుగకు కావాల్సిన సరుకులు కొనాలంటే ఒకట్రెండు సార్లు ఆలోచించాల్సి వస్తోంది. పెరిగిన ధరలతో పండుగ బడ్జెట్ తలకిందులవుతోందని మధ్యతరగతి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
బియ్యం పప్పులు..
రోజూ తినే బియ్యం, పప్పుల ధరలు కొండెక్కుతున్నాయి. పండుగ వేళ మరింతగా పెరుగుతున్నాయి. సన్నరకం (జైశ్రీరామ్) బియ్యం 26 కిలోల సంచి రూ.1,700 నుంచి రూ.1,800 వరకు ఉండేది. ఇప్పుడు రూ.2,000 దాటుతోంది. సంచికి రూ.300 నుంచి రూ.400 వరకు పెరిగింది. సామాన్యుడి రోజువారీ వంటకమైన తొగరి (కంది)పప్పు ఈమధ్య ఉడకటం లేదు. ఎందుకంటే దాని ధర మండిపోతోంది. కిలో రూ.118 ఉన్న కందిపప్పు ఇప్పుడు ఏకంగా రూ.150కి చేరింది. శనగపప్పు రూ.90 నుంచి రూ.110 అయ్యింది. ఇవి కూడా హోల్సేల్ ధరలు. వంటనూనెలపై కేంద్రం దిగుమతి సుంకాల్లో మార్పులు చేయడంతో కొంత ధరలు తగ్గాయి.
పది రోజులు పూజలు.. అదనపు ఖర్చులు
దసరా సందర్భంగా ఇళ్లలో అమ్మవారి పూజలు నిర్వహిస్తారు. పూలు, పండ్లు, కొబ్బరికాయలు, పూజా సామగ్రి కొనుగోలు చేస్తారు. వీటితో పాటు బియ్యం, పప్పులు, వంటనూనె, నెయ్యి, పంచదార, ఇతర సరుకులు అవసరమవుతాయి. పండుగ రోజున ప్రత్యేక వంటకాలు, స్వీట్లు చేసుకోవడం ఆనవాయితీ. కానీ ఈసారి తియ్యటి వేడుకకు ధరల మంట తగులుతోంది. కిలో చక్కెర రూ.47 నుంచి రూ.55కు చేరుకుంది. రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పూజాసామగ్రి ధరలు స్వల్పంగా పెరిగాయి.
సామాన్యులకు ఉపశమనం ఎప్పుడు?
పండుగల సమయంలో ధరల నియంత్రణపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని వినియోగదారులు కోరుతున్నారు. మార్కెట్లలో ధరల పర్యవేక్షణ చేపట్టి, కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పండుగ వేళ కుటుంబాలపై అదనపు భారం పడకుండా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నారు. పండుగ అంటేనే ఆనందం.. ఆ ఆనందం ఖర్చుల ఆందోళనగా మారకుండా చూడాలని కోరుతున్నారు.
పండ్లు, కూరగాయలు..
పండుగకు ప్రత్యేకంగా కొనుగోలు చేసే పండ్లు, పూలతో పాటు కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. కిలో రూ.30 నుంచి రూ.40 ఉండే కూరగాయలు ఇప్పుడు రూ.50 నుంచి రూ.70 వరకు ఉన్నాయి. మార్కెట్కు పెద్దమొత్తంలో వస్తే తప్పా ధర దిగడం లేదు. పండ్లు కూడా రూ.30కి డజన్ ఉన్న అరటి పండ్లు ఇప్పుడు రూ.50కి తగ్గడం లేదు. ఒకేసారి అన్ని రకాల సరుకులు కొనుగోలు చేయాల్సి రావడం, వాటి ధరలు పెరగడంతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బందులు తప్పడం లేదు.
పండుగపూట తప్పదు..
పండుగ పూట ఇంట్లో ఏ వస్తువు లేకున్నా లోటుగా కనిపిస్తుంది. కానీ బియ్యం మొదలుకుని ప్రతీ వస్తువు ధర పెరుగుతూనే ఉంది. ధర పెరిగినా పండుగవేళ కొనక తప్పదు. – సాయిఉష, గృహిణి, నిర్మల్
బడ్జెట్ పెరుగుతోంది..
ఈ మధ్యకాలంలో పెరుగుతున్న ధరలతో నెలవారీ బడ్జెట్ కూడా పెరుగుతోంది. నిత్యం తినే బియ్యం, పప్పులూ పెరిగిపోతున్నాయి. కూరగాయలు కూడా రోజుకో ధరలో ఉంటున్నాయి. మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంది.– రామకృష్ణ, నిర్మల్


