నిర్మల్టౌన్: పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ జానకీ షర్మిల పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల పరిష్కారం, ఈ–పెట్టీ కేసుల డిస్పోజల్, దసరా బందోబస్తు, దుర్గామాత విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లపై సమీక్షించారు. 60, 90 రోజుల గడువుతో దర్యాప్తులో ఉన్న కేసులను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు.
దసరాకు పటిష్ట బందోబస్తు
దసరా పండుగ, దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. నిమజ్జన మార్గాలు, చెరువులు, వాగుల వద్ద ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్, డీసీఆర్బీ, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.


