7
మహిళల ఐక్యతకు వేదిక
తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో ప్రతీ వీధి, ప్రతీ వాడలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. కులమతాలకు అతీతంగా ఒకచోట చేరి బతుకమ్మలను ఆడుతూ పాడుతూ జరుపుకోవడం ఈ పండుగ ప్రత్యేకత. పరస్పర స్నేహభావం, ఐక్యత, సామాజిక సమైక్యతను పెంపొందించడంలో బతుకమ్మ కీలక పాత్ర పోషిస్తుంది. కాలానుగుణంగా కొత్త పాటలు, నృత్యాలు వేడుకల్లో భాగమవుతున్నాయి. సంప్రదాయ గేయాలతోపాటు నూతన గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ పండుగను మరింత ఉత్సాహంగా జరుపుకోవచ్చు. అయితే ఆధునికతను స్వీకరిస్తూనే సంప్రదాయ గేయాలకు, పండుగ ఆచారాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. బతుకమ్మ కేవలం పూలతో చేసే వేడుక మాత్రమే కాదు. ప్రకృతి ఆరాధన, మహిళల ఐక్యత, తెలంగాణ అస్తిత్వం కలగలిసిన గొప్ప సాంస్కృతిక పండుగ. ఈ పండుగ వెనుక ఉన్న తాత్వికతను, సంప్రదాయాలను కాపాడుకుంటూ భావి తరాలకు అందించినప్పుడే బతుకమ్మ వైభవం తరతరాల పాటు కొనసాగుతుంది.
ఖానాపూర్: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచే పండుగ బతుకమ్మ. ఈ పండుగ వెనుక ఒక గొప్ప చారిత్రక వాస్తవం దాగి ఉంది. మహాలయ అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా జరుపుకునే ఈ పండుగ తెలంగాణలోనే పుట్టిందని, దీనికి సుమారు 1100 సంవత్సరాల చరిత్ర ఉందని వాస్తవ తెలంగాణ చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. ఈ పండుగ కేవలం జానపద కథల ఆధారంగా కాకుండా, ఒక నిర్దిష్ట చారిత్రక సంఘటనతో ముడిపడి ఉంది. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ చేరి ఆటపాటలతో జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెబుతోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా గుర్తింపు లభించింది. అప్పటి నుంచి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో వేడుకలను నిర్వహిస్తుండటంతో పండుగ వైభవం మరింత పెరిగింది. మన పండుగ గొప్పతనాన్ని, ఆచార వ్యవహారాల్లోని ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. శనివారం నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.
భక్తి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక
బతుకమ్మను గౌరమ్మగా, పార్వతీదేవి స్వరూపంగా భావించి మహిళలు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి పూజించడం ఈ పండుగలోని ప్రధాన విశిష్టత. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగిసే తొమ్మిది రోజుల వేడుకలు అనేక ఆచారాలు, సంప్రదాయాలతో ముడిపడి ఉంటాయి. ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పే ఈ పూల పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానంతో ముడిపడి ఉంది.
ఆటపాటల్లో తెలంగాణ సంస్కృతి
బతుకమ్మ పండుగలో ఆటపాటలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక జీవనాన్ని ప్రతిబింబించే బతుకమ్మ పాటలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. మహిళలు సామూహికంగా ఒకచోట చేరి, లయబద్ధంగా చప్పట్లు కొట్టుతూ పాడే సంప్రదాయ గేయాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పాటల్లోని భావాలు, పల్లవులు, జానపద పదాలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. భక్తితోపాటు సామాజిక అంశాలు, కుటుంబ అనుబంధాలు, మహిళల జీవిత అనుభవాలు కూడా ఈ పాటల్లో కనిపిస్తాయి. ఇవి మహిళల మధ్య ఆత్మీయతను పెంపొందించడమే కాకుండా, సంప్రదాయాలను భావి తరాలకు అందించే వారధిగా నిలుస్తాయి.
ఖానాపూర్ మండలం బావాపూర్(కె) గ్రామంలో బతుకమ్మ ఆడుతున్న ఆడపడుచులు
విదేశాల్లోనే ఉత్సవాలు
నేను, నా భర్త ఇద్దరం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లం. పదేళ్లుగా విదేశాల్లో ఉంటున్నాం. పండుగలు కూడా అక్కడే జరుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మను ఇక్కడ కూడా ప్రత్యేకంగా జరుపుకుంటాం. నా భర్త జనార్దన్ జానపద కళాకారుడు కూడా. తెలంగాణ పండుగలపై ఎన్నారైలను చైతన్యపరుస్తున్నాడు. – పన్నెల రూప జనార్దన్, ఎన్నారై
గల్ఫ్‌లో జరుపుకుంటాం
ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశమైన ఒమన్(మస్కట్)లో ఉంటున్నాం. సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఏటా సంబరంగా జరుపుకుంటాం. ఇండియన్ సోషల్ క్లబ్ ఒమన్ అధ్యక్షుడు నా భర్త గుండేటి గణేశ్ ప్రత్యేక చొరవ
తో కొన్నేళ్లుగా ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలను జరుపుకుంటున్నాం. తెలంగాణ మహిళలంతా ఉత్సవాలను జయప్రదం చేస్తున్నారు. – గుండేటి సంధ్య గణేశ్, తర్లపాడ్
అమ్మవాళ్ల ఇంటికి వెళ్తా..
బతుకమ్మ, దసరా సందర్భంగా పిల్లలకు సెలవులు రాగానే అమ్మవాళ్ల ఇంటికి వెళ్తాం. పూల పండుగ, దుర్గా నవరాత్రులు, దసరా అక్కడే చేసుకుంటాం. మిగతా పండుగలన్ని అత్తవారింటి వద్దే చేసుకుంటాం. బతుకమ్మ పండుగ మాత్రం పుట్టింట్లో జరుపుకుంటాం.
– ఆడెపు సరిత, ఖానాపూర్


