నిర్మల్‌చైన్‌గేట్: కడెం మండలం ఇస్లాంపూర్ పరిధిలోని కొలాంగూడ గిరిజనులకు మంజూరైన 31 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను టైగర్‌జోన్ నెపంతో ఫారెస్టు అధికారులు అడ్డుకోవద్దని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నందిరామయ్య డిమాండ్ చేశారు. నిర్మల్‌లోని టీఎన్జీవో ఆఫీస్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు సోమవారం ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో దేవదాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఇళ్లు మంజూరై ఏడాది కావస్తున్నా, పునాదులు తవ్విన సమయంలో అటవీశాఖ అధికారులు పనులు నిలిపివేయడంతో గిరిజనులు గుడిసెలు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. అటవీ అధికారుల వేధింపులు ఆపి, నిలిచిపోయిన 31 ఇళ్ల నిర్మాణాలను కొనసాగించడంతోపాటు బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు సిడాం సోనేరావ్, సిడాం భీమ్‌రావ్, ఆత్రం రాము తదితరులు పాల్గొన్నారు.


