ఖానాపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరాన్ని తాజా ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన 9,707 తరగతి గదులను కూల్చివేయాలని, మరో 12,887 గదులకు మరమ్మతులు చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా పాఠశాలల పరిస్థితిపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో 32 ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ సౌకర్యం లేదని యూడైస్ ప్లస్ 2025–26 నివేదిక పేర్కొంది.
ఊడి పడిన ఫ్యాన్..
సెప్టెంబర్ 18న విద్యార్థులు తరగతిలో ఉండగా ఫ్యాన్ ఇనుప చువ్వ సిమెంట్ నుంచి ఊడి కిందపడింది. అది ఒక బాలికపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ప్రమాదం జరిగిన తర్వాతైనా అధికారులు స్పందించి భవనం పరిస్థితిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
తాగునీరు, విద్యుత్ సమస్యలు
జిల్లాలో 7 పాఠశాలలకు తాగునీరు, 32 పాఠశాలలకు విద్యుత్ సౌకర్యం లేదని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో జిల్లాలో పాఠశాలల మౌలిక వసతులపై సమగ్రంగా దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది.
కొత్త భవనం కోసం ఎదురుచూపులు
తిమ్మాపూర్ పాఠశాలలో ఇటీవల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో మరుగుదొడ్ల మరమ్మతులు, విద్యుత్ పనులు, తాగునీటి వసతి కల్పించినా ప్రధాన భవన సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ప్రభుత్వం శిథిల గదులను కూల్చివేయాలని ఆదేశించిన నేపథ్యంలో తిమ్మాపూర్ పాఠశాల భవనాన్ని అధికారులు పరిశీలించి, నూతన భవనం నిర్మించే వరకు ప్రత్యామ్నాయ భవనంలో తరగతులు నిర్వహించాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.
నూతన భవనాలు నిర్మించాల్సి ఉంది..
పట్టణంతోపాటు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఆయా చోట్ల నూతన భవనాలు నిర్మించాల్సి ఉంది. పలుచోట్ల రిపేర్ చేయడం సౌకర్యాలు కల్పించడం వంటి సమస్యలు ఉన్నాయి. డైస్‌తోపాటు ఇతర సమావేశాల్లో పాఠశాలల సమస్యలు సంబందిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. గతంలో పలువురు అధికారులు సైతం ఆయా భవనాలు సందర్శించారు.
– సంధ్యారాణి, ఎంఈవో, ఖానాపూర్
ఇవి కూడా...
ఖానాపూర్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని తిమ్మాపూర్ ఉర్దూ మీడియం పాఠశాల భవనం, ఇక్బాల్‌పూర్‌లోని ఒక పాఠశాల భవనం కూడా శిథిలావస్థలో ఉన్నాయి. మస్కాపూర్ పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌లోని పలు గదులు, పాత ఎల్లాపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లోని కొన్ని గదులు సైతం శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆయా భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన చోట్ల నూతన భవనాలు నిర్మించడంతో పాటు, తాత్కాలికంగా సురక్షిత వసతి కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
శిథిల భవనంలోనే తరగతులు
ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న తిమ్మాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. సొంత భవనం లేకపోవడంతో ఏళ్లుగా శిథిల భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. వర్షాకాలంలో గదుల్లోకి నీరు కారడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్‌సీసీ స్లాబ్ కూడా శిథిలావస్థకు చేరి పైకప్పు పెచ్చులు ఊడే పరిస్థితి నెలకొంది.


