డిజిటల్ ప్రచారం..!
నిర్మల్‌ఖిల్లా: మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తుండడంతో ప్రచారంలో కొత్త పంథా మొదలైంది. నేటి సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు డిజిటల్ ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. గడపగడపకూ ప్రచారానికి తోడుగా సామాజిక మాధ్యమాలను విస్తతంగా వినియోగిస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్, రీల్స్‌లు ప్రచార సాధనాలుగా మారాయి. నిమిషంలోపు నిడివితో ఆకర్షణీయ వీడియోలు, సినిమా పాటల పేరడీలు, ట్రెండింగ్ రీల్స్‌తో అభ్యర్థులు తమ సందేశాన్ని ఓటర్లకు చేరవేస్తున్నారు. ముఖ్యంగా యువ ఓటర్లను ఆకట్టుకునేలా సంగీతం, నినాదాలతో కూడిన షార్ట్స్ విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ప్రతీ కాలనీ, ప్రతీ వార్డును లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి అందులో అభ్యర్థుల ప్రచార వీడియోలు, పోస్టర్లు, హామీలు పోస్టు చేస్తున్నారు. ‘‘డోర్ టు డోర్’’ ప్రచారానికి బదులుగా ‘‘ఫోన్ టు ఓటర్’’ ప్రచారం ఊపందుకుంది. ఒక క్లిక్‌తో వందల మందికి సందేశం చేరుతుండటంతో అభ్యర్థులు ఈ డిజిటల్ మార్గాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఖర్చు తక్కువగా ఉండటం, తక్కువ సమయంలో ఎక్కువ మందిని చేరుకునే అవకాశం ఉండటంతో సోషల్ మీడియా ప్రచారం కీలకంగా మారిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


