కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు
నిర్మల్‌చైన్‌గేట్:మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనే సిబ్బందికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల వారీగా కౌంటింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించనున్న సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు. సమయపాలన అత్యంత ముఖ్యమని, సిబ్బంది నిర్ణీత సమయానికి కౌంటింగ్ కేంద్రాలకు రావాలని తెలిపారు. అన్ని నియమాలు పాటిస్తూ, పారదర్శకంగా, వేగవంతంగా కౌంటింగ్ పూర్తి చేయాలన్నారు. జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు వీరారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్ విజయవంతంగా నిర్వహించినందుకు సిబ్బందిని అభినందించారు. ఓట్ల లెక్కింపును కూడా విజయవంతంగా పూర్తిచేయాలన్నారు. సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సేవాలాల్ జయంతి ఘనంగా నిర్వహించాలి
నిర్మల్‌చైన్‌గేట్:సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 20న ఖానాపూర్‌లో కార్యక్రమాల నిర్వహణపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఖానాపూర్ పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో వేడుకలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమాలకు హాజరయ్యే ప్రజలను దృష్టిలో ఉంచుకుని తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రాంగణంలో అంబులెన్స్‌తోపాటు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని సూచించారు. వేడుకలకు వచ్చే భక్తుల కోసం రవాణా సౌకర్యాలు కల్పించడంతోపాటు వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. భద్రత దృష్ట్యా అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీవో రత్న కళ్యాణి, డీటీడీవో అంబాజీ, అధికారులు, ఉత్సవ సమితి నాయకులు పాల్గొన్నారు.


