నిర్మల్
న్యూస్‌రీల్
ఉత్కంఠగా మున్సిపల్ సమరం నిర్మల్‌లో హస్తమా.. కమలమా.. భైంసా తీర్పుపై మూడు పార్టీల్లో టెన్షన్ ఖానాపూర్ చిక్కేది ఎవరికో.. క్యాంపులకు తరలిన అభ్యర్థులు
ఉదయం నుంచి మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రారంభం సాయంత్రానికి వెలువడనున్న ఫలితాలు పాలిటెక్నిక్ కళాశాలలో భారీ భద్రత మధ్య కౌంటింగ్ ఫలితాలపై ప్రజలు, రాజకీయవర్గాల్లో ఉత్కంఠ
నిర్మల్ పీఠం ఎవరిది..
నిర్మల్:నిర్మల్‌లో 42వార్డుల విజేతలు ఎవరు..!? భైంసా బల్దియా 26 వార్డులు ఎవరెవరికి దక్కనున్నాయి..!? ఖానాపూర్ మున్సిపాలిటీ 12 వార్డుల్లో గెలిచేదెవరు..!?పోటాపోటీగా సాగిన పుర సమరంలో పీఠం ఎవరికి దక్కనుంది..!? అధికార కాంగ్రెస్ గెలుచుకుంటుందా..!? తొలిసారి బీజేపీ దక్కించుకుంటుందా..!? ఎంఐఎం జెండా ఎగరేస్తుందా..!? బీఆర్‌ఎస్ కారు మళ్లీ దూసుకువస్తుందా..!? స్వతంత్రులు ప్రభావం చూపుతారా..!? ఈ ప్రశ్నలన్నింటికీ మరికొన్ని గంటల్లోనే సమాధానాలు రానున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో పోరు ఉత్కంఠభరితంగా సాగింది. చాలా వార్డుల్లో ఎవరికి ఓటేయాలనే విషయంలో ఓటర్లు సైతం స్పష్టంగా తేల్చలేకపోయారు. దీనికి తోడు తక్కువగా నమోదైన పోలింగ్ శాతం ఎవరిపై ప్రభావం చూపుతుందో తెలియడం లేదు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గంటల వ్యవధిలోనే బ్యాలెట్ బాక్సుల్లోని అభ్యర్థుల జాతకం, పట్టణాల్లో పార్టీల భవితవ్యం తేలనుంది.
భైంసా బల్దియా దక్కేదెవరికి..!
హైదరాబాద్ పాతబస్తీ తర్వాత వరుస విజయాలతో భైంసా బల్దియాను ఎంఐఎం తమ అడ్డాగా మార్చుకుంది. మైనార్టీ ఓట్లే కీలకంగా మైషా పట్టణం తీర్పు ఉండనుంది. ఈసారి కూడా విజయం తమదేనని మాజీ మున్సిపల్ చైర్మన్ జాబీర్ అహ్మద్ చెబుతున్నారు. మరోవైపు ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ స్థానం దక్కించుకుంటామని, మ్యాజిక్ ఫిగర్ దాటుతామని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పేర్కొంటున్నారు. మరోవైపు పార్టీ టికెట్లు దక్కని సీనియర్ నేతలు చాలా వార్డులలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. ఆయా వార్డుల్లో వారి ప్రభావమూ ఉంది.
ఈ రెండు పార్టీల మధ్య కాంగ్రెస్ ప్రభావం చూపుతుందని మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ చెబుతున్నారు. ఇక గత ఎన్నికల్లో దెబ్బతిన్న కారు పార్టీ ఈసారి కొన్ని స్థానాలైనా దక్కించుకుంటుందని బీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు.
ఖానా‘పురం‘లో పాగా వేసేదెవరో..
జిల్లాలో చిన్న మున్సిపాలిటీగా 12 వార్డులతో రెండోసారి ఎన్నికలను నిర్వహించుకున్న ఖానాపురం ఎవరి పరం కానుందో చెప్పడం కష్టం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని మున్సిపల్ ఎన్నికలను ముందుండి నడిపించారు. మున్సిపాలిటీని గెలుస్తామని చెబుతున్నారు. మరోవైపు జిల్లాలో అంతోఇంతో బీఆర్‌ఎస్ పార్టీ బలంగా ఉందంటే అది ఖానాపూర్‌లోనే. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి జాన్సన్‌నాయక్ తన సత్తాను కూడా తెలిపేందుకు పురపోరును సీరియస్‌గా తీసుకున్నారు. తమకు వచ్చిన నివేదికల ప్రకారం చైర్మన్‌స్థానం కారు కై వసం చేసుకుంటుందని చెబుతున్నారు. ఇక పార్టీ ఓటుబ్యాంకుపై బలమైన నమ్మకం పెట్టుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌రాథోడ్ సైతం ఖానాపూర్ తమదేనని బలంగా చెబుతున్నారు. ఇక్కడ మూడు పార్టీలు పోటాపోటీగా తలపడటంతో హంగ్ వాతావరణం కనిపిస్తోంది. ఒకరిద్దరు స్వతంత్రులు గెలిస్తే వారికి పండుగే.
క్యాంపుల్లోకి ‘కౌన్సిలర్లు‘..!
‘ఎవరు గెలుస్తారో తెలియదు.. ఫలితాల తర్వాత ఎవరు ఎక్కడ ఉంటారో చెప్పలేం. అందుకే కౌన్సిలర్ అభ్యర్థులు అందరినీ క్యాంపులకు తరలించాం’ అని జిల్లాకేంద్రానికి చెందిన ఓ పార్టీ నేత పేర్కొన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు తమ అభ్యర్థులందరినీ క్యాంపులకు తరలించాయి. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కచ్చితంగా 20 స్థానాలకుపైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ అభ్యర్థులను మహారాష్ట్ర వైపు పంపించినట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎలాగూ చైర్మన్ స్థానం తమదేనని, అభ్యర్థులు కలిసి ఉండడానికే క్యాంపులకు తరలించినట్లు చెబుతోంది. పార్టీల లెక్కలు ఎలా ఉన్నాప్రజలు తీర్పు మరికొన్ని గంటల్లో
తేలిపోనుంది.
నిర్మల్‌చైన్‌గేట్:కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికవర్గం పోరాటాలకు సిద్ధం కా వాలని సీపీఐయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు గురువారం తలపెట్టిన సమ్మెలో భాగంగా సీపీఐయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్మల్ గాంధీపార్క్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన నూతన కార్మిక చట్టాలను, కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆశ, గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలన్నారు. అసంఘటిరంగ కార్మికులకు కార్మికుల సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని, స్కీం వర్కర్లను పర్మినెంట్ చేయాలని కోరారు.
నాలుగు లేబర్‌కోడ్‌లతో తీవ్ర నష్టం..
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్‌ల అమలుతో సంఘటిత, అసంఘటిత కార్మికులు, వారి కుటుంబాలకు తీవ్ర నష్టమన్నారు. కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలోని కార్మిక చట్టాలను నియంతృత్వ, దౌర్జన్యపూరితంగా కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుని మార్చిందన్నారు. ఇది ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసే రాజ్యాంగ వ్యతిరేక చర్య అన్నారు. లేబర్ కోడ్‌లు రద్దయ్యే వరకు పోరాడాలని పేర్కొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దుర్గ నూతనకుమార్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి డి.పోశెట్టి, గిరిజన సంఘం నాయకులు తొడసం శంభు, గొర్రెల, మేకల సంఘం జిల్లా నాయకుడు ముత్యం, ఆశ వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి.సుజాత, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి లలిత, కార్యదర్శి శైలజ, మధ్యాహ్న భోజన యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బొడ్డు గోదావరి, ఉపాధ్యక్షురాలు లక్ష్మి, మల్లేశ్, రాజేశ్వర్ పాల్గొన్నారు.
మూడు వార్డుల్లో అధిక పోలింగ్
భైంసాటౌన్:భైంసా మున్సిపల్ ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం కాస్త తక్కువగా నమోదైంది. ఈసారి మూడు వార్డుల్లోనే అధికశాతం ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. 26 వార్డుల్లో 51,118 మంది ఓటర్లు ఉండగా, 32,035 మంది మాత్రమే ఓటేశారు. మొత్తంగా 62.67 శాతం పోలింగ్ జరిగింది. 22వ వార్డులో అత్యధికంగా 69.56 శాతం పోలైంది. ఇక్కడ 2,267 మంది ఓటర్లు ఉండగా, 1,577 మంది ఓటేశారు. 6, 14 వార్డుల్లోనూ అధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. రెండు వార్డుల్లో 69.24 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా 20వ వార్డులో 56.58 శాతం పోలవగా, ఇక్కడ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎండీ జాబీర్ అహ్మద్ బరిలో ఉన్నారు.
నిర్మల్ మున్సిపాలిటీలో 2014, 2020 ఎన్నికల్లో దాదాపు ఏకపక్షంగా ఫలితాలు వచ్చాయి. ఈసారి ఎన్నికలు మాత్రం పోటాపోటీ వాతావరణంలో సాగాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ స్థానికంగా బీజేపీ ప్రజాప్రతినిధులు ఉండటంతో ఈ రెండు పార్టీల మధ్య గట్టిపోటీ నెలకొంది. 42 వార్డులలో 10–14 మైనార్టీ వార్డులు మినహాయిస్తే, మిగిలిన 28–30 వార్డులలో బీజేపీ ఈసారి బలమైన పోటీ ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తమకు 20పైన వార్డులు గెలుస్తామని, చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంటామని బీజేఎల్పీ నేత, స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చెబుతున్నారు. మరోవైపు మైనారిటీ వార్డులు కలుపుకొని మెజార్టీ స్థానాల్లోనూ తామే విజయం సాధిస్తామని, నిర్మల్ బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ చైర్ పర్సన్ అభ్యర్థి అప్పల కావ్య గణేశ్‌చక్రవర్తి పేర్కొంటున్నారు. ఆరేళ్ల క్రితం మున్సిపాలిటీని గెలిచి పాలించిన బీఆర్‌ఎస్ ఈసారి ఉనికిని చాటుకునేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. కారు గుర్తుపై పోటీ చేసిన సీనియర్లలో కొంతమందికే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్‌చార్జిగా వ్యవహరించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ నిర్మల్‌లో తమ పార్టీ కీలకంగా మారుతుందని అంటున్నారు. గత ఎన్నికల్లో దెబ్బతిన్న ఎంఐఎం ఈసారి మాత్రం పట్టు పెంచుకుంటామని, బల్దియాలో పతంగి ఎగురవేస్తామని చెబుతోంది. మిగతా మున్సిపాలిటీలతో పోలిస్తే నిర్మల్‌లో స్వతంత్రుల ప్రభావం నామమాత్రంగానే కనిపిస్తోంది.
నిర్మల్


