అంగన్‌వాడీల్లో ‘తొలిముద్ద’ | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో ‘తొలిముద్ద’

Apr 4 2026 7:25 AM | Updated on Apr 4 2026 7:25 AM

● చిన్నారులకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయం

లక్ష్మణచాంద: అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మౌలిక వసతుల కల్పనలో భాగంగా సొంత భవనాలు లేని కేంద్రాలకు ఇటీవలే నూతన భవనాలు మంజూరు చేసింది. చాలా గ్రామాల్లో ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర సర్కార్‌ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు తొలిముద్ద పేరుతో అల్పాహారం అందించాలని నిర్ణయించింది. ఇటీవలనే హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

జిల్లాలో 56,588 మందికి లబ్ధి..

రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు రెడీ టూ కుక్‌ ఉప్మా, కిచిడి వంటి వాటిని అల్పాహారంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 19 మండలాలు 400 గ్రామ పంచాయతీల పరిధిలో నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మూడు ప్రాజెక్టుల కింద మొత్తం 931 అగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులు 56,588 మంది, గర్భిణులు 4,904, బాలింతలు 4,798 మంది ఉన్నారు.

జిల్లా సమాచారం...

జిల్లాలో మొత్తం మండలాలు 19

గ్రామాలు 400

ప్రాజెక్టులు 03

అంగన్‌వాడీ కేంద్రాలు 931

3 నుంచి6 ఏళ్లలోపు చిన్నారులు 56,588

గర్భిణులు 4,904

బాలింతలు 4,798

ఆటపాటలతో బోధన...

అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు టీచర్లు నిత్యం ఆటపాటలతో కూడిన విద్యను బోధిస్తున్నారు. అలాగే గుడ్డుతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. వీటితోపాటు చిన్నారులకు బాలామృతం, ప్రతీ చిన్నారికి నెలకు 16 చొప్పున కోడిగుడ్లు అందిస్తున్నారు. అయినా చిన్నారులకు సమతుల ఆహారం అందక అనారోగ్యానికి గురవుతున్నారు. దీనిని పూర్తిగా అరకట్టడానికి అల్పాహారం కార్యక్రమం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిముద్దతో అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పోషక విలువలతో కూడిన అల్పాహారం కూడా చిన్నారులకు అంది మరింత మేలు చేకూరనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement