లక్ష్మణచాంద: జిల్లాలో గతేడాది పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు రావాల్సిన రెమ్యునరేషన్ డబ్బులు ఇప్పటి వరకు రాలేదు. సకాలంలో రావాల్సిన డబ్బులు ఇప్పటి వరకు రాకపోవడంతో ఏడాదిగా ఉపాధ్యాయులు ఎదురుస్తున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో గతేడాది పదో తరగతి మూల్యాంకనంలో 617 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనం జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో ఏప్రిల్ 6 నుంచి 16 వరకు పది రోజులపాటు జరిగింది. జిల్లాకు గతేడాది సుమారు లక్ష వరకు పేపర్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
రెమ్యునరేషన్ ఇలా..
పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనంలో పాల్గొనే ఉపాధ్యాయులకు ఒక స్క్రిప్ట్‌కు వాల్యుయేషన్ చేసినందుకు రూ.10, అలాగే జూనియర్ టీచర్లకు ఒక రోజుకు రూ.300 డీఏ, సీనియర్ టీచర్‌కు ఒక రోజుకు రూ.400 చెల్లించాలి.
జిల్లాకు రూ.21 లక్షల బకాయి..
గతేడాది పదో తరగతి మూల్యాంకనంలో నిర్మల్ జిల్లాలో మొత్తం 617 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వీరికి మూల్యాంకనం డబ్బులు రూ.21 లక్షలు రావాల్సి ఉంది. రెమ్యునరేషన్ కోసం ఇప్పటికే ఉపాధ్యాయులు అధికారులకు విన్నవించారు.
త్వరలోనే రెమ్యునరేషన్..
గతేడాది పదో తరగతి మూల్యాంకనం బడ్జెట్ ఇటీవలనే మంజూరైంది. బిల్లులు తయారు చేసి ట్రెజరీకి ఇప్పటికే పంపించాం. ఈ కుబేర్‌లో పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే డబ్బులు నేరుగా ఉపాధ్యాయుల ఖాతాల్లో జమవుతాయి. ఈ నెలాఖరులోపు జమయ్యే అవకాశం ఉంది.
– భోజన్న, డీఈవో
ఏడాది కావొస్తున్నా..
పదో తరగతి మూల్యాంకనం గతేడాది ఏప్రిల్ 16న పూర్తయింది. ఏప్రిల్ 30 న వార్షిక పరీక్షల ఫలితాలు వెల్లడించారు. మూల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఏడాది కావొస్తున్నా రెమ్యునరేషన్ రాలేదు.ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు రావాల్సిన రెమ్యునరేషన్ విడుదల చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.


