వేడెక్కిన ఖానా‘పురం’ | - | Sakshi
Sakshi News home page

వేడెక్కిన ఖానా‘పురం’

Apr 4 2026 7:25 AM | Updated on Apr 4 2026 7:25 AM

● చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠ ● కౌన్సిలర్‌ కిడ్నాప్‌తో మారుతున్న సమీకరణలు

ఖానాపూర్‌: ఖానాపూర్‌ మున్సిపల్‌ రాజకీయం మళ్లీ వేడెక్కింది. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికపై మళ్లీ ఉత్కంఠ నెలకొంది. ఫిబ్రవరిలో కోరం లేక రెండుసార్లు వాయిదా పడిన ఈ ఎన్నికలు శనివారం జరుగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తీవ్రంగా రంగంలోకి దిగాయి. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మున్సిపాల్టీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో మ్యాజిక్‌ ఫిగర్‌ దక్కించుకునే ప్రయత్నాలు వేడెక్కాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు పీఠాన్ని సాధించేందుకు వ్యూహ, ప్రతి వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. కౌన్సిలర్ల మద్దతు కోసం క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి.

కిడ్నాప్‌ ఆరోపణలతో ఉద్రిక్తత..

ఇదిలా ఉండగా, ఎన్నికల వేళ కౌన్సిలర్‌ కిడ్నాప్‌ ఆరోపణలు సంచలనం సృష్టించాయి. 5వ వార్డు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ పోసవ్వను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. ఈ విషయమై గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, వెంటనే ఆమెను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. అయితే ఈ ఆరోపణలను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ ఖండించారు. ఇది కేవలం డ్రామా మాత్రమేనని, కౌన్సిలర్లను కిడ్నాప్‌ చేయాల్సిన అవసరం తమకు లేదని పేర్కొన్నారు. మున్సిపల్‌ పీఠం కాంగ్రెస్‌కే దక్కుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

భారీ బందోబస్తు..

గతంలో సమావేశం వాయిదా పడిన నేపథ్యంలో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. శనివారం నిర్వహించే ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కిడ్నాప్‌ ఆరోపణలు, క్యాంపు రాజకీయాలు, పరస్పర విమర్శల మధ్య ఖానాపూర్‌ మున్సిపల్‌ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement