ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రత
ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు అనుమతి ఉన్నవారికే ప్రవేశం ఎస్పీ జానకీషర్మిల
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో కౌంటింగ్ ప్రక్రియపై పోలీసు అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ బారికేడింగ్, ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ప్రవేశంపై పాటించాల్సిన విధివిధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనుమతి పత్రాలు ఉన్న సిబ్బంది, ప్రతినిధులను మాత్రమే లోపలికి అనుమతించాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన భద్రతాచర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బందోబస్తు, గస్తీ బలగాల మోహరింపు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సమావేశంలో భైంసా ఏఎస్పీ రాజేశ్‌మీనా, నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.


