ప్రజాభిప్రాయం మేరకే అభ్యర్థుల ఎంపిక
ఖానాపూర్: పార్టీ ఆధ్వర్యంలో పలు సర్వేలు నిర్వహించి ప్రజాభిప్రాయం మేరకే ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులకే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను పోటీలో నిలిపిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్‌తో కలిసి శనివారం మాట్లాడారు. ఖానాపూర్‌కు ఇటీవల మంజూరైన రూ.15 కోట్ల నిధులతో మున్సిపాలిటీ పరిధిలోని ఒక్కో వార్డుకు రూ.కోటికిపైగా నిధులు కేటాయించి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.22 కోట్ల నిధులతో అమృత్–2 పనులు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని, ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతీ కుటుంబానికి రేషన్ కార్డు అందజేశామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతీ రేషన్ కార్డుదారుకు సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో హుడా చైర్మన్ తాహెర్‌బిన్ హమ్‌దాన్, మాజీ మంత్రి ఐకేరెడ్డి, టీపీసీసీ జిల్లా పరిశీలకులు చంద్రశేఖర్‌గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎంఏ.మాజిద్, మున్సిపల్ మాజీ చైర్మన్‌లు చిన్నం సత్యం, అంకం రాజేందర్, జెడ్పీ మాజీ కోఅప్షన్ సభ్యుడు యూసుఫ్‌ఖాన్ పాల్గొన్నారు.


