మాతాశిశులో మెరుగైన సేవలు అందించాలి
నిర్మల్‌చైన్‌గేట్: ప్రభుత్వ మాతా, శిశు ఆస్పత్రిలో గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని మాతా, శిశు ఆస్పత్రిని శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్ పేషంట్, ఔట్ పేషంట్ వార్డులు, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, స్కానింగ్ కేంద్రం, టీకాల గది, చిన్నారులకు పాలిచ్చే గది, మందుల గది, మరుగుదొడ్లు పరిశీలించారు. పలు రిజిస్టర్లను తనిఖీ చేసి, అన్ని విభాగాల్లో రికార్డులు సక్రమంగా నిర్వహించాలన్నారు. అవసరమైన టీకాలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నవజాత శిశువులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతోపాటు తాగునీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. చికిత్స కోసం వచ్చిన మహిళలతో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలతో మెరుగైన వైద్యం అందుతుందని భరోసా ఇచ్చారు. పార్కింగ్ సమస్యలు లేకుండా చూడాలని, భద్రత పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్‌ఎంవో రమేశ్, విభాగాధిపతి సరోజ, ప్రోగ్రాం ఆఫీసర్ సౌమ్య, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ ధనలక్ష్మి, తహసీల్దార్ రాజు తదితరులు ఉన్నారు.


