పల్లె నేతల ప్రచారం
నిర్మల్‌ఖిల్లా: జిల్లాలో పుర ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. నిర్మల్, ఖానాపూర్, భైంసా పట్టణాల్లో రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారింది. కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున మిత్రులు, బంధువులు, సహచర నాయకులు గడపగడపకూ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. రెండు నెలల క్రితం జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా పట్టణాల నుంచి నాయకులు తరలివెళ్లి ప్రచారం నిర్వహించారు. అప్పట్లో ‘పల్లె గెలుపు కోసం పట్టణం’ అన్న నినాదం వినిపించగా, ఇప్పుడు దానికి భిన్నంగా ‘పుర విజయం కోసం పల్లె’ అన్న దృశ్యం కనిపిస్తోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన సారంగాపూర్, దిలావర్‌పూర్, లక్ష్మణచాంద, మామడ మండలాల నాయకులు ప్రచారం చేస్తున్నారు. తమకు పరిచయం ఉన్న, బంధుత్వం కలిగిన కుటుంబాల ఓట్లపై ఫోకస్ పెడుతున్నారు. ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, సమావేశాల్లో పల్లె నాయకుల సందడి స్పష్టంగా కనిపిస్తోంది.


