బంగారు భవితకు బాటలు
లక్ష్మణచాంద: రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షల ముందు ప్రభుత్వ, ఆదర్శ, కేజీబీవీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అవగాహన చేపట్టింది. గ్రామీణ విద్యార్థులు ఉన్నత చదువులు ఎంచుకోవడంలో ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందుకోసం ఉపాధ్యాయులకు ముందుగా శిక్షణ ఇచ్చారు.
జిల్లాలో 9,932 మందికి ప్రయోజనం
జిల్లా ప్రభుత్వ ఉన్నత, ఆదర్శ, కేజీబీవీ పాఠశాలల్లో 4,911 మంది బాలురు, 5,021 మంది బాలికలు పదో తరగతి చదువుతున్నారు. మొత్తం 9,932 మందికి కెరీర్ గైడెన్స్‌పై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో అయోమయాన్ని తగ్గించి, సరైన కెరీర్ ఎంపికకు సహాయపడుతుంది. మార్కులతోపాటు జీవిత మార్గదర్శకత్వం అందిస్తూ గ్రామీణ యువతకు ఆత్మవిశ్వాసం నింపుతుంది.
కార్యక్రమ లక్ష్యాలు..
అవగాహన కల్పించాలి
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి. ఏ కోర్సు చదివితే భవిష్యత్తులో అవకాశాలు ఎలా ఉంటాయో తెలియజేయాలి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి.
– భోజన్న, డీఈవో


