మిగిలినోళ్లు.. రెబెల్స్
నిర్మల్: పురపోరులో జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల నుంచి ఎవరెవరు తలపడనున్నారో దాదాపు ఫైనల్ అయ్యింది. నామినేషన్లు వేసిన తమ పార్టీ అభ్యర్థులకు బీఫాంలు ఇచ్చారు. మరోవైపు నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగియనుంది. మూడురోజులుగా బుజ్జగించినా, సంప్రదింపులు జరిపినా నామినేషన్లను ఉపసంహరించుకోకపోతే వారిని రెబెల్స్(స్వతంత్ర)గా పరిగణించనున్నారు. మూడు మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల నుంచే ఒక్కోవార్డుకు ఇద్దరు ముగ్గురు నామినేషన్లు వేశారు.
బుజ్జగించినా..
జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో కలిపి 80 వార్డులు ఉండగా, అన్ని పార్టీలు, స్వతంత్రులు కలిపి ఏకంగా 629 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా బీజేపీ నుంచి160, కాంగ్రెస్ నుంచి 142, బీఆర్‌ఎస్ నుంచి 104, ఎంఐఎం నుంచి 81, ఇతరులు 142 నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల నుంచి ఒక్కో వార్డుల్లో కనీసం ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. కొన్నిచోట్ల ముగ్గురు నలుగురూ వేశారు. ఈ మూడురోజులపాటు పార్టీల జిల్లా ఇన్‌చార్జీలు, సీనియర్ నేతలు వారితో సంప్రదింపులు, బుజ్జగింపులు జరిపారు. అయినా.. నిర్మల్, భైంసాల్లోని కొన్నివార్డుల్లో కొందరు వెనక్కి తగ్గడం లేదు.
ఉపసంహరణకు నేడే ఆఖరు..
నామినేషన్ల ఉపసంహరణకు ఒకరోజు ముందు అంటే సోమవారమే దాదాపు ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. నిర్మల్‌లో బీజేపీ ఒకట్రెండు వార్డులు మినహా అందరినీ ఖరారు చేశాయి. కాంగ్రెస్ మొత్తం 42 వార్డుల అభ్యర్థులను సోమవారం సాయంత్రం ప్రకటించింది. ఇక ఈ రెండుపార్టీల్లో టికెట్లు రాని, తమ పార్టీ పేరును రాసిచ్చిన వారికి బీఫాం ఇచ్చే ఉద్దేశంతో బీఆర్‌ఎస్ తన జాబితా ప్రకటించకుండా, మంగళవారం వరకూ వెయిట్ చేసేలా కనిపిస్తోంది. ఇక నామినేషన్ల పర్వం ముగిసినా.. ఉపసంహరణ చేసుకోనివారిని ఆయా పార్టీలు సస్పెండ్ చేయనున్నట్లు ప్రకటించాయి. అలాంటి అభ్యర్థులు సొంతపార్టీ అభ్యర్థులపైనే రెబల్స్‌గా బరిలో నిలువనున్నారు.
మిగిలినోళ్లు.. రెబెల్స్


