నిర్మల్
న్యూస్‌రీల్
అడెల్లిలో భక్తుల సందడి
సారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన అడెల్లి శ్రీమహాపోచమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉమ్మడి జిల్లాతోపాటు నిజమాబాద్, కరీంనగర్, జగిత్యాల, హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలించారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ చైర్మన్ భోజాగౌడ్, ఈవో భూమయ్య ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
కృష్ణ శిలలతో నూతనంగా నిర్మించిన
అడెల్లి పోచమ్మ ఆలయం
కొత్త గుడిలోకి..
అడెల్లి పోచమ్మ
నిర్మల్: పసుపుతో మెరుస్తున్న నిండైన రూపం.. నుదుట ఎర్రగా దీప్తించే కుంకుమ, చేతిలో త్రిశూలం, కళ్లల్లో కరుణారసమయమైన చూపు.. ఇదే అడెల్లి పోచమ్మ రూపం. తన పిల్లలను రక్షించే శక్తిగా అమ్మవారు.. జిల్లా ఇలవేల్పుగా భక్తుల మదిలో కొలువై ఉన్నారు. ప్రతీ ఇంటి ఆడబిడ్డగా పూజలందుకుంటున్నారు. ఎవరికి ఏ కష్టమచ్చినా.. అమ్మా.. అడెల్లి పోశవ్వా ఆదుకో అని కోరితే చాలు.. తల్లి సల్లంగ చూస్తూ ఓదార్పునిస్తుందని భక్తుల విశ్వాసం. జిల్లా ఆడబిడ్డ ఇప్పుడు కొత్త గుడిలో కొలువుదీరబోతోంది. సారంగపూర్ మండలంలోని పచ్చని పర్వతాలచాటున వెలసిన ఈ పవిత్ర క్షేత్రం ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల భక్తులు ఎక్కువగా పూజిస్తారు. నూతనంగా నిర్మించిన ఆలయంలో పునఃప్రతిష్టించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి ఈనెల 7 వరకు అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించనున్నారు.
విశ్వాసానికి ప్రతిరూపం..
అడెల్లి పోచమ్మ పేరు ప్రజలలో మాతృస్నేహానికి దర్పణం. పుట్టినబిడ్డకు భోజన్న, భోజవ్వ, పోశెట్టి, పోశమ్మ వంటి పేర్లు పెట్టే ఆచారం ఈ దేవత నుంచి పుట్టింది. పుట్టుకనుంచి వివాహానికి, జీవితంలోని ప్రతి ముఖ్య ఘట్టానికి ముందు అమ్మవారిని పూజించే సంప్రదాయం ఉంది. అడెల్లి పోచమ్మ దీవెనలు ఉంటే పనులన్నీ నిరాటంకంగా జరుగుతాయని నమ్ముతారు.
పార్వతీపరమేశ్వరుల బిడ్డనే..
అడెల్లి అంటేనే నిండా పచ్చదనంతో ఉండే అడవితల్లి ఖిల్లా. సారంగపూర్ మండలంలో పరవశింపజేసే ప్రకృతిఒడిలోనే పోచమ్మ కొలువైంది. శతాబ్దాల క్రితం ఈ ప్రాంతమంతా తీవ్ర కరువు, దుర్భిక్షం ఏర్పడిందట. వందలమంది ప్రాణాలు కోల్పోయారట. అప్పుడు ఇక్కడి ప్రజలందరూ పరమశివున్ని వేడుకున్నారట. ఆ పరమేశ్వరుడు కరుణించి తన బిడ్డగా పోచమ్మ ఈప్రాంతంలో కొలువుదీరి ప్రజల కష్టాలను తీరుస్తుందని చెప్పారట. అలా కొలువుదీరే పోచమ్మ కోసం ఓగద్దెను కట్టాలని పరశురాముడిని శివుడు ఆదేశించాడట. అలా ఆ తల్లి ఇక్కడ పరశురామ నిర్మితమైన గద్దైపె స్వయంభూగా వెలసింది. అప్పటి నుంచి ఈ ప్రాంతమంతా పచ్చని పంటలతో సుభిక్షంగా మారిందని ప్రజల నమ్మకం.
నిర్మల్
నిర్మల్
నిర్మల్


