శ్రీనివాసుని కల్యాణం
ఖానాపూర్: పట్టణంలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ 41వ వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. వేదపండితులు చక్రపాణి వాసుదేవాచార్యులు, నర్సింహమూర్తి, సందీప్‌శర్మ కల్యాణోత్సవం జరిపించారు. అంతకుముందు యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ట, యజ్ఞం, ధ్వజారోహణం, గరుడపెల్లి, హవనం, బలిహరణ కార్యక్రమాలు నిర్వహించారు. తిమ్మాపూర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మట్టెలు, మంగళసూత్రం, పట్టువస్త్రాలు ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. కల్యాణం అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు అడ్డగట్ల రాజన్న, నిమ్మల రమేశ్, డాక్టర్ కిరణ్‌కుమార్, వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
