తేమ విషయంలో ఆందోళన వద్దు
భైంసాటౌన్: సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించే రైతులు తేమ విషయంలో ఆందోళన చెందవద్దని కలెక్టర్ అభిలాష అభినవ్, ముధోల్ ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ అన్నారు. పట్టణంలోని ఏఎంసీ కాటన్ యార్డులో సీసీఐ కొనుగోళ్లను సోమవారం ప్రారంభించారు. రైతులు సీసీఐ కేంద్రాలకు నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. తేమ శాతం విషయంలో అధికారులు సహకరిస్తారని భరోసా ఇచ్చారు. పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, యాప్‌లో స్లాట్ బుకింగ్‌కు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వివరించారు. మార్కెట్ యార్డుల్లో తాగునీరు, విశ్రాంతి గదులు, తూకం యంత్రాలు, కంట్రోల్ రూమ్ వంటి వసతులు కల్పించినట్లు తెలిపారు. ఈసారి జిల్లాలో 1,41,455 ఎకరాల్లో పత్తి సాగు చేశారని, 11,08, 646 క్వింటాళ్ల దిగుబడి అంచనా వేశామని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, వర్షాల కారణంగా తేమ శాతం విషయంలో అధికారులు సడలింపు ఇవ్వాలన్నారు. అనంతరం మార్కెట్ యార్డులో కలెక్టర్, ఎమ్మెల్యే సోయా కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ప్రతీ గింజ సోయా పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. దశలవారీగా టోకెన్లు జారీ చేసి పంట కొనుగోలు చేస్తామన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్‌కుమార్, మార్కెటింగ్ ఏడీ గజానన్, డీఏవో అంజిప్రసాద్, ఏఎంసీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో నీరజ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
