పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు
భైంసాటౌన్: జిల్లాలో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నిర్మల్, భైంసా, కుభీర్, సారంగపూర్ మండల కేంద్రాల్లోని జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో దళారులు, వ్యాపారులు టీఆర్(తాత్కాలిక రిజిస్ట్రేషన్)లతో రైతుల పేరిట సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించి మోసాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అయితే, ఈసారి మరింత పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు జరిపేందుకు కేంద్రం కపాస్ కిసాన్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో పత్తి విక్రయించే రైతులకు ఇబ్బంది లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఇంకా ఎవరికై నా సందేహాలుంటే సీసీఐ కేంద్రాల వద్ద సీసీఐ సిబ్బంది నివృత్తి చేస్తారని భైంసా ఏఎంసీ ఉన్నతశ్రేణి కార్యదర్శి పూర్యానాయక్ ‘సాక్షి’తో తెలిపారు. వివరాలు ఆయన మాటల్లో..
జిల్లాలో 15 సీసీఐ కేంద్రాలు..
జిల్లాలో 15 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశాం. భైంసాలో 10, నిర్మల్ 02, కుభీర్ 02, సారంగపూర్ 01 మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు జరుగుతాయి. అయితే, ముందుగా భైంసాలో 04, కుభీర్, సారంగాపూర్, నిర్మల్‌లో ఒక్కో మిల్లులో కొనుగోళ్లు ప్రారంభిస్తున్నాం. పత్తి రాక బట్టి మిగిలిన కేంద్రాలు ప్రారంభిస్తాం.
అవగాహన కోసం సిబ్బంది..
కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్‌పై వ్యవసాయ శాఖ అధికారులు ఇదివరకే అవగాహన కల్పించారు. ఇంకా, అవగాహన లేని రైతుల కోసం సీసీఐ కేంద్రాల వద్ద కేంద్రానికి నలుగురు చొప్పున సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఎలాంటి సందేహాలున్నా వారిని సంప్రదించవచ్చు.
ఎకరానికి 11 క్వింటాళ్లు..
రైతులు 8–12 తేమ శాతం ఉన్న నాణ్యమైన దిగుబడులు తీసుకురావాలి. తేమ ఉన్న పత్తిని తేవొద్దు. నిబంధనల మేరకు ఉన్న పత్తికి క్వింటాల్‌కు రూ.8,110 మద్దతు ధర చెల్లిస్తాం. రైతుల నుంచి ఎకరాకు 11 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేస్తాం.
నాలుగైదు రోజుల్లో చెల్లింపులు..
పత్తి విక్రయించిన వెంటనే వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తాం. నాలుగైదు రోజుల్లో ఆధార్‌తో లింక్ ఉన్న రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. గతంలో పోస్టాఫీస్ ఖాతాల్లో నగదు పరిమితికి ఏర్పడిన ఇబ్బందుల దృష్ట్యా ఈసారి ప్రభుత్వం నగదు పరిమితిని ఎత్తివేసింది.
స్లాట్ నంబర్‌తో రావాలి...
పత్తి విక్రయించే రైతులు ముందుగా కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి. పత్తి విక్రయించే తేదీ, జిన్నింగ్ మిల్లుతో కూడిన స్లాట్ నంబర్‌తో సీసీఐ కేంద్రానికి రావాలి. ఆధార్‌కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ వెంట తెచ్చుకోవాలి. ఆధార్ నంబర్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో రైతు సాగు చేసిన పత్తి వివరాలు కనిపిస్తాయి. దాని ఆధారంగానే కొనుగోళ్లు జరుపుతాం. ఈసారి టీఆర్(తాత్కాలిక రిజిస్ట్రేషన్)లకు అవకాశం లేదు.
పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు


