అమ్మకు అక్షర ‘ఉల్లాస్’ం
సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమం
జిల్లాలో 33,344 మంది అభ్యాసకుల గుర్తింపు
బోధనకు వలంటరీ టీచర్ల నియామకం
లక్ష్మణచాంద: ‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’ అనే నానుడిని నిలబెట్టే దిశగా ప్రభుత్వం మరో అడుగు వేసింది. వయోజన మహిళల్లో అక్షరాస్యతను పెంచడానికి కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఉల్లాస్’ కార్యక్రమంలో భాగంగా ‘అమ్మకు అక్షరమాల’ పేరిట విద్యాబోధన చేయాలని నిర్ణయించింది. డిజిటల్ యుగంలోనూ వయోజనులు నిరక్షరాస్యులుగా ఉండడం అభివృద్ధికి ఆటంకంగా మారింది. ఈ నేపథ్యంలో వయోజనుల్లో.. ముఖ్యంగా మహిళల్లో అక్షరాస్యత పెంచి వారిని ప్రాథమిక జ్ఞానం, డిజిటల్ నైపుణ్యాలతో శక్తివంతులను చేయాలని కేంద్రం సంకల్పించింది.
విద్యాప్రగతికి కొత్త దిశ
2011 గణాంకాల ప్రకారం నిర్మల్ జిల్లా జనాభా 7,09,418 కాగా, అందులో మహిళలు 3,62,697, పురుషులు 3,46,721 మంది ఉన్నారు. జిల్లాలో అక్షరాస్యత కేవలం 57.77 శాతంగా నమోదైంది. ఈ నిష్పత్తిని గణనీయంగా పెంచడానికి ప్రభుత్వం అమ్మకు అక్షరమాల కార్యక్రమం చేపట్టింది.
నిరక్షరాస్యుల గుర్తింపు
‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమానికి డీఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రతీ మండలంలో ఇంటింటి సర్వే నిర్వహించి నిరక్షరాస్యులను గుర్తించారు. జిల్లాలో 33,344 మందిని అభ్యాసకులుగా నమోదు చేశా రు. వీరికి బోధించేందుకు 3,363 మంది వలంటరీ టీచర్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. వలంటరీ టీచర్లకు మండలాల వారీగా శిక్షణ కూడా పూర్తి చేశారు. బోధనకు అవసరమైన మార్గదర్శక పుస్తకాలను, పాఠ్య పుస్తకాలను అందజేశారు.
విద్యాబోధన ప్రారంభం..
నవంబర్ 1న ఉల్లాస్ కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. 100 రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమంలో ప్రతీరోజు సాయంత్రం మూడు గంటలు విద్యాబోధన చేస్తారు. మొత్తం 300 గంటల తరగతులు నిర్వహిస్తారు. ఈ తరగతుల ద్వారా పాఠాలు నేర్చుకునే మహిళలు తమ కుటుంబాలకే కాకుండా సమాజానికీ అక్షర దీపాలుగా మారతారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
అక్షరాస్యత పెంచాలి..
ఉల్లాస్ కార్యక్రమం జిల్లాలో అమ్మకు అక్షరమాల పేరుతో శనివారం ప్రారంభమైంది. జిల్లాలో గుర్తించిన అభ్యాసకులు ఉల్లాస్ కార్యక్రమాన్ని సద్వినియోగంచేసుకుని అక్షరాస్యులుగా మారాలి. వలంటరీ టీచర్లు తమకు అప్పగించిన 10 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి. జిల్లా అక్షరాస్యత పెంపునకు కృషిచేయాలి. – భోజన్న, డీఈవో
మండలాల వారీగా గుర్తించిన అభ్యాసకులు, వలంటీర్ల వివరాలు...
మండలం అభ్యాసకులు వలంటీర్లు
బాసర 1,302 135
భైంసా 2,232 212
దస్తురాబాద్ 1,115 112
దిలావార్‌పూర్ 1,572 158
కడెం 1,319 144
ఖానాపూర్ 1,387 137
కుభీర్ 3,534 351
కుంటాల 2,062 204
లక్ష్మణచాంద 1,388 166
లోకేఽశ్వరం 1,314 121
మామడ 2,817 275
ముధోల్ 1,475 159
నర్సాపూర్(జి) 1,166 130
నిర్మల్ అర్బన్ 416 35
నిర్మల్ రూరల్ 2,942 308
పెంబి 1,247 136
సారంగాపూర్ 1,577 172
సోన్ 2130 201
తానూర్ 2,349 208
జిల్లా సమాచారం....
జిల్లా మొత్తం జనాభా(2011 ప్రకారం)7,09,418
పురుషులు 3,46,721
మహిళలు 3,62,697
జిల్లా అక్షరాస్యత శాతం 57.77
జిల్లాలో గుర్తించిన నిరక్షరాస్యులు 33,344
నియమించిన వలంటరీ టీచర్లు 3,363
అమ్మకు అక్షర ‘ఉల్లాస్’ం


