
డిగ్రీ చేసిన డిపెండెంట్లకు క్లర్క్ పోస్టులు
శ్రీరాంపూర్: సింగరేణి గని ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగుల స్థానంలో డిగ్రీ చదివిన డిపెండెంట్లకు సూటబుల్ జాబ్ కింద గ్రేడ్ 3 క్లర్క్‌పోస్ట్ ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. 2009లో అప్పుడున్న గుర్తింపు సంఘం ఏఐటీయూసీకి, యజమాన్యానికి మధ్య జరిగిన చర్చల్లో గని ప్రమాదాల్లో ఉద్యోగులు చనిపోతే వారి పిల్లలకు విద్యార్హతను బట్టి సూటబుల్ జాబ్ కల్పించాలని ఒప్పందం జరిగింది. కానీ కేవలం ఐటీఐ, బీటెక్ వంటి టెక్నికల్ చదువులు చదివిన వారికి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టెక్నికల్ సూపర్‌వైజర్లుగా సూటబుల్ జాబ్ కల్పిస్తున్నారు. నాన్ టెక్నికల్ చదువులైన డిగ్రీ మరే ఇతర సత్సమాన డిగ్రీ విద్యార్హత ఉన్న డిపెండెంట్లకు మాత్రం అండర్‌గ్రౌండ్‌లో జనరల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం కల్పిస్తున్నారు. దీనిపై ప్రస్తుత గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు పలుమార్లు యజమాన్యంతో చర్చించారు. స్ట్రక్షరల్ సమావేశంలో కూడా ఈ డిమాండ్‌ను పెట్టారు. దీంతో గురువారం ఈ అంశంపై హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎల్సీ సమక్షంలో యజమాన్యానికి, గుర్తింపు సంఘానికి మధ్య ట్రైపార్టీయేట్ సమావేశం జరిగింది. ఇందులో సమస్యలను పరిష్కరిస్తూ రాత పూర్వక ఒప్పందం జరిగింది. ఉద్యోగి గని ప్రమాదంలో మృతి చెందితే డిగ్రీ అర్హత కలిగిన వారి పిల్లలకు గ్రేడ్ 3 క్లర్క్‌గా ఉద్యోగం కల్పించబోతున్నారని గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ తెలిపారు. ఇదిలా ఉంటే 2009 నుంచి మైన్స్ యాక్సిడెంట్ కేసుల్లో డిపెండెంట్లు డిగ్రీ అర్హత ఉండి జనరల్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేస్తున్న వారికి కూడా గ్రేడ్ 3 క్లర్క్ ఇప్పిస్తామని తెలిపారు.