
గిరి గ్రామాల అభివృద్ధే లక్ష్యం
నేరడిగొండ: గిరిజన గ్రామాల అభివృద్ధే ఆదికర్మ అభియాన్ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ పరిశీలకుడు జితేంద్రసింగ్ అన్నారు. గురువారం మండలంలోని వివిధ గ్రామపంచాయతీల్లో పర్యటించి కార్యక్రమం అమలు తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా లింగట్ల గ్రామ పంచాయతీలోని గోండుగూడలో గుస్సాడీ నృత్యంతో ఆయనకు స్వాగతం పలికారు. లింగట్ల రాజురా, వెంకటపూర్ గ్రామపంచాయతీల్లో కార్యక్రమం అమలు, గ్రామాభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక, గ్రామసభ, గ్రామ సోషల్ మ్యాపింగ్, నిరుద్యోగ యువత గుర్తింపు వంటి అంశాలను పరిశీలించి సంతృప్తి చెందారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి వంటి అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. నేరడిగొండ మండలంలోని 12 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం అమలవుతుందని ఆయన పేర్కొన్నారు.