
ఉయ్యాలో..
పాటపాడే అక్కాచెల్లెళ్లు
బతుకమ్మ అనగానే అందరికీ గుర్తొచ్చేవి.. తీరొక్క పువ్వులు.. బతుకమ్మ పాటలు. ప్రస్తుతం పూలకు ఎంత డిమాండ్ ఉందో.. పాటలకు అంతే ఉంది. ఏటా కొత్త కొత్త పాటల కోసం మహిళలు ఎదురు చూస్తుంటారు. అయితే ఒకప్పుడు బతుకమ్మ ఆట, పాటలు సంప్రదాయబద్ధంగా ఉండేవి. మహిళలు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించే పాటలు పాడేవారు. క్రమంగా ఆ పాటలు కనుమరుగవుతున్నాయి. అయితే ఇప్పటికీ కొందరు పాత పాటలతో ఆకట్టుకుంటున్నారు. ఇక ప్రస్తుత తరం.. జానపద పాటలు, కోలాటాల నృత్యాలతో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ వేడుకల్లో పాటలు సద్దుల బతుకమ్మ వరకు ఊరూరా.. వాడవాడలా మార్మోగుతున్నాయి. పూల పండుగలో పాడే పాటల్లో సామాజిక అంశాలు, కుటుంబ బాంధవ్యాలు దాగి ఉన్నాయి. బతుకమ్మ పాటలపై నాటి, నేటి మహిళల అభిప్రాయాలు..
పల్లెదనాన్ని ప్రతిబింబించేలా...
నిర్మల్‌ఖిల్లా: బతుకమ్మ పాటలు అంటేనే పల్లె జీవనాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటాయి. మన సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానం ఉట్టిపడే బతుకమ్మ పాటలు వారసత్వ సంపదగా కాపాడుకుంటూనే భావితరానికి తెలియజెప్పేందుకు ప్రయత్నం చేయాలి. నేటితరం అభిరుచికి అనుగుణంగా పాతకొత్తల మేలు కలయికగా పాటల్ని రూపొందించుకుంటే మంచిది.
– ఎల్.నవ్య, సింగర్, నిర్మల్
ప్రోత్సహించాలి
నిర్మల్‌ఖిల్లా: పాటలు పాడే వారిని గుర్తించి ప్రోత్సహిస్తేనే బతుకమ్మ సంప్రదాయం నిలుస్తుంది. ప్రభుత్వంతో పాటు సంఘాలు కూడా బతుకమ్మ పాటల పోటీలు నిర్వహిస్తే కొత్తతరానికి ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటి తరానికి బతుకమ్మ పాటల్ని సొంతంగా పాడేవారన్న విషయమే తెలియదు.
– పర్కిపండ్ల లక్ష్మి, తాండ్ర, సారంగపూర్
పాటల వెనుక నాటి జ్ఞాపకాలు
నిర్మల్‌ఖిల్లా: మా చిన్నప్పటి నుంచి బతుకమ్మ పాటలు అంటే ప్రాణం. సాయంత్రం వేదికల వద్ద బతుకమ్మల చుట్టూ తిరుగతూ పాటలు పాడటం ఆనందంగా ఉండేది. బీడీ కంపనీలో తోటివారితో కలిసి సామూహికంగా బతుకమ్మ ఆడుతూ స్వయంగా పాటలు పాడుకునే వాళ్లం. కానీ ఇప్పటి తరం మాత్రం మొబైల్, టీవీ, డీజే పాటలతో బతుకమ్మ ఆడుతున్నారు.
– సంగెం భూదేవి,
అనంతపేట, నిర్మల్ రూరల్
సంస్కృతిని పరిరక్షిస్తూనే...
నిర్మల్‌ఖిల్లా: కాలానుగుణంగా పాటలరూపం మారినా, ఆత్మ మాత్రం అదే. ఈ తరం భాషలో, బీట్‌లో పాడినా బతుకమ్మ స్ఫూర్తి అందుతుంది. కొత్తగా సృజనాత్మకంగా పాటలను వెలుగులోకి తెస్తున్నారు. నవతరం యువతుల అభిరుచికనుగణంగా పాటలు రూపుదిద్దుకుంటున్నాయి.
– శైలజ, జానపద గాయని, నిర్మల్
ఏడు దశాబ్దాలకు పైగా..
నాకు 80 సంవత్సరాలు. నా చిన్ననాటి నుంచి ఏడు దశాబ్దాలకు పైగా బతుకమ్మను చూస్తూ వస్తున్నా. ఇప్పటికీ బొడ్డెమ్మ పాటలు కై గట్టి పాడుతా. ఈతరం మహిళలు బతుకమ్మ ప్రాధాన్యతను తెలియజెప్పే విధంగా ఆ పాటలు నేర్చుకోవాలి. వారసత్వ సంపద లాంటి బతుకమ్మ పాటలు కనుమరుగు కాకుండా సంరక్షించుకోవాలి. – కట్కం రుక్మాబాయి, బోరిగాం, సారంగాపూర్

ఉయ్యాలో..

ఉయ్యాలో..

ఉయ్యాలో..

ఉయ్యాలో..

ఉయ్యాలో..

ఉయ్యాలో..

ఉయ్యాలో..