
లంబాడీలను తొలగించే వరకు ఉద్యమిస్తాం
తలమడుగు: ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే వరకు ఉద్యమిస్తామని తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోడం గణేశ్ అన్నారు. గురువారం రాయి సెంటర్, 9 ఆదివాసీ తెగలు, తుడుందెబ్బ, ఇతర సంఘాల ఆధ్వర్యంలో వేంకటేశ్వర ఆలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు మహా పాదయాత్ర నిర్వహించారు. కుమురంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకు దెరువు కోసం వలస వచ్చి ఆదివాసీలకు రావాల్సిన అభివృద్ధి ఫలాలను రాకుండా చేస్తున్న లంబాడీలను వెంటనే తొలగించాలన్నారు. అక్రమంగా వలస వచ్చిన వారికి ఎస్టీ కులధ్రువీకరణ పత్రాలు జారీ చేయవద్దన్నారు. అనంతరం తహసీల్దార్ రాజమోహన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ మండల అధ్యక్షుడు జంగాల పోచన్న, డివిజన్ అధ్యక్షుడు కుముర జ్ఞానేశ్వర్, రాయి సెంటర్ అధ్యక్షుడు రామారావు, ఉపాధ్యక్షుడు భుజంగరావు పాల్గొన్నారు.