
జల సంరక్షణలో భేష్
జాతీయ స్థాయిలో ‘జల్ సంచయ్ జన్ భాగీధారి’ పురస్కారం భూగర్భ జలాల పెంపులో మూడు జిల్లాల ప్రగతి ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు రూ.2కోట్లు, నిర్మల్‌కు రూ.కోటి నగదు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భూగర్భ జలాల పెంపు, సంరక్షణ చర్యలకుగాను మంచిర్యాల, ఆదిలా బాద్, నిర్మల్ జిల్లాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. కేంద్ర ప్రభుత్వ ‘జల్ సంచయ్ జన్ భాగీ ధారి’ అవార్డు వరించింది. ఇందుకు ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు రూ.2కోట్ల చొప్పున, నిర్మల్ జిల్లాకు రూ.కోటి నగదు పురస్కారం అందనుంది. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. ‘నీటిని ఒడిసిపట్టు–వాన ఎప్పుడు, ఎక్కడ కురిసినా’ అనే నినాదంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గత నాలుగేళ్లుగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. గత ఏడాది నుంచి మరింత ప్రోత్సాహం అందించేందుకు ఆయా జిల్లాల్లో చేపట్టిన పనులపై అవార్డులతోపాటు నగదు పురస్కారంతోనూ సత్కరిస్తోంది. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం భూగర్భ జలాల లభ్యత, నీటి సంరక్షణ, నా ణ్యత పెంచుకోవడంతోపాటు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా కరువును ఎదుర్కొనేలా వాననీటిని ఒడిసిపట్టి భవిష్యత్ తరాలకు వాడుకోవాల్సి ఉంటుంది.
సత్ఫలితాలు ఇస్తున్న నిర్మాణాలు
ఉపాధి హామీ పథకంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని పలు పథకాల కింద భూగర్భ జలాల పెంపునకు గ్రామీణ ప్రాంతాల్లో నీటికుంట లు, చెరువులు, చెక్‌డ్యామ్‌లు, కందకాలు, పైకప్పు నీటి సేకరణ నిర్మాణాలు, వ్యక్తిగత, సామాజికపరంగా, బోర్ రీచార్జి కుంటలు నిర్మిస్తున్నారు. ఇవే కాకుండా పట్టణాల్లో ఇంటింటికీ ఇంకుడుగుంతల నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే వ్యవసాయ, తాగు, సాగు అవసరాలు, అటవీ ప్రాంతాల వృద్ధి కోసం ఆయా చోట్ల సామాజికపరంగా ఉపయోగపడేందుకు చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తున్నారు. దీంతో వర్షపు నీటిని ఎక్కడికక్కడ భూమిలో ఇంకేలా చేయడంతో సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. నమోదు చేసిన వివరాల ప్రకారం గత మే నెలలో కేంద్ర అధికారులు, శాస్త్రవేత్తల బృందాలు భూగర్భ జలాల పరిరక్షణకు చేపట్టిన నిర్మాణాలతో భూమిలో నీటి లభ్యత పెరిగినట్లు గుర్తించారు. దీంతో వ్యవసాయానికి బావులు, బోర్ల నీటి ఊటలు పెరిగినట్లు గుర్తించారు. అలాగే ఇంకుడు గుంతలతోనూ జల వృద్ధి ఉన్నట్లుగా తేలింది. నీటిని సద్వినియోగంతో ఆయా ప్రాంతాల అభివృద్ధికి దోహదపడనుంది.
జిల్లా చేపట్టిన నిర్మాణాలు
ఆదిలాబాద్ 98,693
మంచిర్యాల 84549
నిర్మల్ 60365