
చలో గంగనీళ్ల జాతర
నేటి నుంచి అడెల్లి మహాపోచమ్మ జాతర ఏర్పాట్లు చేసిన దేవాదాయ శాఖ అధికారులు భారీగా తరలిరానున్న భక్తులు ఈసారీ.. బాలాలయంలోనే..
సారంగపూర్: జిల్లాలోని అడెల్లి గ్రామానికి జాతర శోభ వచ్చింది. మహాపోచమ్మ గంగనీళ్ల జాతర శని, ఆదివారాల్లో(27, 28 తేదీల్లో) నిర్వహించనున్నా రు. మహాలయ అమావాస్య తర్వాత వచ్చే శని, ఆదివారాల్లో జాతర నిర్వహించడం సంప్రదాయం. జాతర కోసంఅధికారులు, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
ఆభరణాల మూటగట్టడంతో జాతర..
జాతర శనివారం ఉదయం అమ్మవారి ఆభరణాలను మూటగట్టడంతో ఆరంభమవుతుంది. కౌట్ల(బి), అడెల్లి, సారంగాపూర్ గ్రామాల భక్తులు, సేవాదారులు అడెల్లి పోచమ్మ ఆలయం నుంచి ఆభరణాలను తలపై ధరించి కాలినడకన దిలావర్‌పూర్ మండలం సాంగ్వి గ్రామంలో గోదావరి నదికి చేరుకుంటారు. ఈ యాత్రలో ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామస్తులు మేళతాళాలతో, సంప్రదాయ వాయిద్యాలతో సాగనంపుతారు.
గోదావరి యాత్ర..
ఆభరణాలను సేవాదారులు తలపై ధరించి అడెల్లి, సారంగాపూర్, యాకర్‌పెల్లి, వంజర్, ప్యారమూర్, కదిలి, మాడెగాం, దిలావర్‌పూర్, బన్సపెల్లి, కంజర్, మల్లాపూర్ గ్రామాల మీదుగా సాంగ్వి చేరుకుంటారు. భక్తులు ‘‘గంగా నీకు శరణమే’’ అంటూ భక్తి గీతాలు ఆలపిస్తూ యాత్రలో పాల్గొంటారు. సాంగ్విలోని పోచమ్మ ఆలయంలో ఆభరణాలను ఉంచి పూజలు నిర్వహిస్తారు. ఆదివారం తెల్లవారుజామున ఆభరణాలను గోదావరి నదీతీరానికి తీసుకెళ్లి శుద్ధి చేసి, మూటగట్టి తిరిగి అడెల్లి ఆలయానికి చేరుకుంటారు.
అడెల్లిలో మహోత్సవం..
ఆదివారం ఉదయం అమ్మవారికి పూజలు నిర్వహించిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రాత్రి 10 గంటల వరకు ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ జాతరకు భారీగా భక్తులు తరలిరావడంతో మహాజాతరగా పిలుస్తారు. ఆభరణాలను అమ్మవారికి అలంకరించి ప్రత్యేక పూజలతో జాతర ముగుస్తుంది.
ప్రత్యేక ఏర్పాట్లు..
జాతర కోసం నిర్మల్, భైంసా నుంచి అడెల్లి ఆలయానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. నిర్మల్ రూరల్ సీఐ, స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహన పార్కింగ్ కోసం ఆలయానికి దూరంగా స్థలం కేటాయించారు. స్థానిక పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.
బాలాలయంలోనే పూజలు..
అడెల్లి మహాపోచమ్మ నూతన ఆలయ నిర్మాణం మూడు నెలల క్రితం పూర్తయింది. అయినా అధికారుల నిర్లక్ష్యం, పాలకుల సమన్వయ లోపంతో ప్రారంభోత్సవం జరగలేదు. చైన్నెలోని మహాబలిపురంలో 11.51 లక్షలతో విగ్రహాల తయారీ పూర్తయినా వాటి ప్రతిష్ఠాపనలో జాప్యం జరుగుతోంది. దసరా, దీపావళి మధ్య ప్రతిష్టాపన చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో జాతర, పూజలు ఈసారి కూడా బాలాలయంలోనే నిర్వహిస్తారు.
సాంగ్విలో ఏర్పాట్లు
దిలావర్‌పూర్: గంగనీళ్ల జాతరకు మండలంలోని సాంగ్వి గ్రామంలో ఏర్పాట్లు చేశారు. సారంగాపూర్, దిలావర్‌పూర్ మీదుగా అమ్మవారి నగలు శోభయాత్రగా సాంగ్వికి చేరుకుంటాయి. శనివారం సారంగాపూర్ మండలం అడెల్లి మహాపోచమ్మ ఆలయం నుంచి నగలను దిలావర్‌పూర్ మండలం కదిలి, మాటేగాం, దిలావర్‌పూర్, బన్సపల్లి, కంజర్ గ్రామాల మీదుగా సాంగ్వికి తీసుకురానున్నారు. శనివారం రాత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆదివారం గోదావరి నదీతీరంలో అమ్మవారి నగలను నదీజలాలతో శుద్ధిచేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అడెల్లికి తీసుకెళ్తారు. ఏఎస్పీ రాజేశ్‌మీనా, సీఐ కృష్ణ, దిలావర్‌పూర్ ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఏర్పాట్లు పూర్తి..
జాతర నిర్వహణ కోసం విస్తృత ఏర్పాట్లు చేపట్టాం. వారం రోజుల ముందునుంచే ఆయా గ్రామాల్లో, మండలాల్లో ప్రచారం నిర్వహించాం. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్సు సౌకర్యం, వైద్యసదుపాయం, తాగునీరు, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం.
– భోజాగౌడ్, అడెల్లి ఆలయ కమిటీ అధ్యక్షుడు