
బతుకమ్మ వేడుక.. చైతన్య వేదిక
నిర్మల్: తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మను సామాజిక చైతన్యం కోసం వినియోగిస్తూ జిల్లా పోలీసు శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఎస్పీ జానకీ షర్మిల ఆధ్వర్యంలో ‘కమ్యూనిటీ బతుకమ్మ’ కార్యక్రమం ద్వారా మహిళలతో కలిసి పాటలు పాడుతూ, ఆడుతూ సైబర్ నేరాలు, మోసాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం గృహిణులను ఒకచోట చేర్చి, సామాజిక సమస్యలపై చైతన్య వేదికగా మారింది.
గృహిణులే సైబర్ బాధితులు..
ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాల్లో గృహిణులు ప్రధాన బాధితులుగా మారుతున్నారు. భర్త, పిల్ల లు బయట ఉండగా ఇంట్లో ఒంటరిగా ఉండే మహిళలను సైబర్ నేరస్తులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ‘మీ భర్తను డిజిటల్ అరెస్ట్ చేశాం, ఓటీపీ ఎంటర్ చేయండి’ లేదా ‘పట్టుచీర గెలుచుకున్నారు, లింక్ క్లిక్ చేయండి’ వంటి ఆకర్షణీయమైన ఎత్తుగడలతో మోసం చేస్తున్నారు.
ఇంటి బాధ్యతలు, సామాజిక జాగ్రత్తలు..
గృహిణులు కేవలం ఇంటి బాధ్యతలతోనే సరిపెట్టుకోకుండా, సామాజిక సమస్యలపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లలు సెల్‌ఫోన్లలో ఏం చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఎవరితో పరిచయాలు పెంచుకుంటున్నారు వంటి అంశాలను పరి శీలించాలి. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడంతో కొందరు యుక్తవయసు పిల్లలు మత్తుపదార్థాలకు బానిసలవుతూ, తప్పుదారి పడుతున్నారు.
మహిళల సమైక్యత..
విద్యార్థులు, యువతను కలవడానికి స్కూళ్లు, కళాశాలలు లేదా సమావేశాలు సరిపోతాయి. కానీ, గృహిణులను ఒకచోట చేర్చడం సవాలుతో కూడుకున్న పని. బతుకమ్మ పండుగ మాత్రం ఈ సవాలును సులభతరం చేస్తుంది. గల్లీలోని మహిళలను ఒకచోటకు చేర్చి, ఆడుతూ పాడుతూ సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తుంది. ఎస్పీ జానకీషర్మిల నాయకత్వంలో పోలీసు శాఖ ‘కమ్యూనిటీ బతుకమ్మ’ ద్వారా మహిళలకు సైబర్ నేరాలు, మోసాలపై అవగాహన కల్పిస్తోంది. నాయుడివాడ ఆర్యవైశ్య సంఘంలో జరిగిన కార్యక్రమంలో సుమారు 300 మంది మహిళలు పాల్గొనడం ఈ కార్యక్రమ విజయానికి నిదర్శనం.
సైబర్ నేరాల నివారణకు చైతన్యం..
స్మార్ట్‌ఫోన్ యుగంలో రోజుకో కొత్త సైబర్ నేరం పుట్టుకొస్తోంది. ఈ నేరాలు మహిళలను ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ‘కమ్యూనిటీ బతుకమ్మ’ కార్యక్రమంలో పోలీసులు ఓటీపీ షేర్ చేయవద్దని, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దని, డిజిటల్ అరెస్ట్ వంటి భయపెట్టే ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని సూచిస్తున్నారు. అలాగే, యుక్తవయసు పిల్లలను తప్పుదారి నుంచి కాపాడేందుకు తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. మహిళా పోలీసులతో కూడిన ‘పోలీస్ అక్క’, ‘నారీశక్తి’, ‘శివంగి టీమ్’ వంటి కార్యక్రమాలను కూడా పరిచయం చేస్తూ, సమాజంలో సురక్షిత వాతావరణం కోసం కృషి చేస్తున్నారు.
అవగాహన కల్పించేందుకే..
బతుకమ్మ పండుగవేళ మహిళలతో కలిసి పోలీసుశాఖ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా ‘కమ్యూనిటీ బతుకమ్మ’ పేరిట గృహిణులకు పలుఅంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. జిల్లావ్యాప్తంగా కమ్యూనిటీ బతుకమ్మకు మంచిస్పందన వస్తోంది. – డాక్టర్ జానకీషర్మిల, ఎస్పీ