
బాసరలో వైభవంగా శారదీయ శరన్నవరాత్రులు
బాసర: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీజ్ఞాన సరస్వతీదేవి క్షేత్రంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు శుక్రవారం అమ్మవారు ‘స్కందమాత’ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు నాలుగు చేతులతో సింహంపై కూర్చుని, చేతిలో కమలం, జలకలశం, ఘంటాతోపాటు, స్కందుడైన కార్తికేయుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని, ఒక చేయి అభయముద్రలో భక్తులను అనుగ్రహిస్తుంది. ఆలయ వైదికబృందం అమ్మవారికి చతుషష్టి ఉపచార విశేష పూజలు నిర్వహించి పెరుగన్నం నైవేద్యంగా నివేదించారు. అమ్మవారి దర్శనానికి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా భక్తులు తరలివచ్చారు. తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు చేయించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఇన్‌చార్జి ఈవో అంజనీదేవి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం..
వేడుకల్లో భాగంగా శుక్రవారం ఆలయ కోటి గాజుల మండపంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని శాంకరి పాఠశాల విజయవల్లి భరద్వాజ్ వారిచే కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. భవానీ మాత అలంకరణలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఇవి భక్తులను అలరించాయి.
పాదయాత్రగా వచ్చిన భక్తులు....
బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకునేందుకు కిరణ్ గురూజీ బడుల్కర్ ఆధ్వర్యంలో భక్తులు మహారాష్ట్ర నాందేడ్ జిల్లా నుంచి బాసర వరకు పాదయాత్రగా వచ్చారు. అమ్మవారిని దర్శించుకున్నారు.
గోదావరిలో పుణ్య స్నానాలు..
వేడుకల కోసం బాసరకు వస్తున్న భక్తులు పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శివాలయంలో పూజలు చేసి సరస్వతీ అమ్మవారికి మొక్కలను చెల్లించుకుంటున్నారు.