
ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం
నిర్మల్‌చైన్‌గేట్: చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని స్థానిక అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐలమ్మ జయంతిని శుక్రవారం అధికారికంగా నిర్వహించారు. పలువురు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణ పోరాటాల చరిత్రలో ఒక గొప్ప అధ్యయనాన్ని లిఖించిందన్నారు. వెట్టి చాకిరీ నిర్మూలనకు పాటుపడిన గొప్ప మహిళ అని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, రజక సంఘం అధ్యక్షుడు శంకర్, సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.