
సాంగ్విలో 18వ శతాబ్దపు విగ్రహాలు
దిలావర్‌పూర్: మండలంలోని సాంగ్వి గ్రామ శివారు గోదావరి తీరాన చండిక, చాముండీ విగ్రహాలను గుర్తించినట్లు ప్రముఖ కవి, రచయిత డాక్టర్ తుమ్మల దేవరావు తెలిపారు. ఈ విగ్రహాల విశిష్టత వాటి స్వరూపాన్ని శుక్రవారం వివరించారు. చండిక పార్వతీదేవి రౌద్రరూపంగా, ఆది పరాశక్తిగా వర్ణింపబడుతుందన్నారు. చండా అంటే చేయించగల అని అర్థమన్నారు. శ్వేతాశ్వతరోపనిషత్‌లో చండికను ఆది పరాశక్తిగా వర్ణించారని తెలిపారు. మహిషాసుర మర్ధనం చేయడం ద్వారా దుర్గాదేవిగా చండికను భావిస్తారన్నారు. మెడలో పుర్రెలతో కూడిన హారం, కుడిచేతిలో ఆయుధం, ఎడమ చేతిలో బిందు, మోదకం, కర్ణాభరణాలు ఉన్నాయని వివరించారు. ఉగ్రరూపంలో ఉన్న చండిక దుష్ట సంహారణ చేసి భక్తులకు అభయమిచ్చిందని భావిస్తారని తెలిపారు. అలాగే మరో ప్రతిమ చాముండీ చాముండేశ్వరీ దేవిగా వివిధ పేర్లతో పిలిచే చాముండీ పార్వతీదేవి ఉగ్రరూపం అన్నారు. సప్త మాతృకలలో ఒకటిగా భావిస్తారన్నారు. దేవీ పురాణాల్లో దుర్గాదేవి సైన్యంలో 81 మంది తాంత్రిక దేవతలలో ఒక యోగినిగా చాముండిని ఆరాధిస్తారని పేర్కొన్నారు. చెండా, ముండా అనే ఇద్దరు రాక్షసులను సంహరించడం వల్ల చాముండేశ్వరీగా పిలుస్తారని తెలిపారు. చాంముడేశ్వరీ భయంకరమైన రూపం కలిగి మెడలో కపాల మాల, కుడిచేతిలో కత్తి, మరో చేతిలో ఆయుధం, గుడ్లగూబ వాహనంగా ఉంటుందని వివరించారు. ఈ రెండు విగ్రహాలు 18వ శతాబ్దపు కాలంలో ఆరాధనలు జరిగినట్లు తెలియజేస్తుందన్నారు. కర్ణాటక ప్రాంతంలో మధ్య భారతంలో చాముండీ, చండిక దేవతలను ఆరాధించారని తెలిపారు. క్షేత్ర పర్యటనలో భాగంగా తుమ్మల దేవరావుతోపాటు అబ్బడి రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
అరుదైన చండిక, చాముండి విగ్రహాలు

సాంగ్విలో 18వ శతాబ్దపు విగ్రహాలు