
‘ఆట’ంకాలు తొలగేదెన్నడో
లక్ష్మణచాంద: మైదానాల్లోనే క్రీడాకారులు తయారవుతారనే సూత్రం ఆధారంగా, గ్రామీణ ప్రాంత విద్యార్థులలో దాగిఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసి, వాటికి పదును పెట్టడం ద్వారా వారిని మండల, జిల్లా, జోనల్, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దవచ్చు. పాఠశాలస్థాయి నుంచే క్రీడల ద్వారా విద్యార్థులకు మానసిక ఉల్లాసం, చురుకుదనం, శారీరక దృఢత్వం పెరుగుతాయనే ఉద్దేశంతో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో ఏటా వివిధ క్రీడా పోటీలను నిర్వహిస్తారు. అయితే, ఈ ఏడాది ఎస్‌జీఎఫ్ క్రీడల షెడ్యూల్‌పై స్పష్టత లేకపోవడంతో గ్రామీణ విద్యార్థులు, క్రీడాకారులు అనిశ్చితిలో ఉన్నారు.
జిల్లాలో క్రీడా అవకాశాలు
జిల్లాలో 164 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 18 కేజీబీవీలు, 15 గురుకులాలు, 1 మోడల్ స్కూల్, 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ సంస్థల్లో చదివే విద్యార్థులు అండర్–14, అండర్–17, అండర్–19 వయో విభాగాల్లో బాల, బాలికలకు విడివిడిగా నిర్వహించే క్రీడా పోటీల్లో పాల్గొనవచ్చు. క్రికెట్, ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, చదరంగం, టెన్నిస్, బాస్కెట్‌బాల్ వంటి వివిధ క్రీడల్లో మూడు అంచెల్లో (మండల, జిల్లా, జోనల్) పోటీలు జరుగుతాయి. మండలస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జిల్లా, జోనల్, రాష్ట్ర, జాతీయ స్థాయిలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం పొందుతారు. అయితే, ఈ ఏడాది జిల్లాలో ఏ క్రీడలను ఎక్కడ నిర్వహించాలి, ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు.
నిధుల కొరత..
ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో ఏటా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థుల కోసం మండల, జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తారు. అయితే, ఈసారి క్రీడలకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో నిర్వాహకులు ఆసక్తి కోల్పోతున్నారు. మండల స్థాయి పోటీల నిర్వహణకు పాఠశాలలు ముందుకు రాకపోవడం, ఖర్చుల భారం నిర్వహణ పాఠశాలలపైనే పడటం వంటి సమస్యలు ఉన్నాయని వ్యాయామ ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కారణంగా ఈ సంవత్సరం ఎస్‌జీఎఫ్ క్రీడల నిర్వహణ ఆలస్యమవుతున్నట్లు సమాచారం. రాాష్ట్ర ప్రభుత్వం ఎస్‌జీఎఫ్ క్రీడలకు తగిన నిధులను కేటాయిస్తే, గ్రామీణ విద్యార్థులలో దాగిఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసి, వారిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే స్థాయికి తీసుకెళ్లవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రీడల నిర్వహణకు ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలని, అలాగే దాతలు ముందుకు వచ్చి సహకరించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.