
అండగా ఉంటాం
పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తాం.. జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన బాసర, ట్రిపుల్‌ఐటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ముఖాముఖి.
భైంసా/బాసర: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. జిల్లాలోని బాసరలో దెబ్బతిన్న పంటలను బుధవారం పరిశీలించారు. కలెక్టర్ అభిలాష అభినవ్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్‌తో కలిసి సోయాబీన్ పంటలను సందర్శించారు. రైతులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పారు. దెబ్బతిన్న పంటల సర్వే చేసి, పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
జ్ఞాన సరస్వతి ఆలయంలో పూజలు..
బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారిని మంత్రి జూ పల్లి కృష్ణారావు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. పూజల అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం మహాంకాళి అమ్మవారి ఆలయంలో కూడా పూజలు చేశారు.
ఆలయ అభివృద్ధిపై సమీక్ష..
కలెక్టర్ అభిలాష అభినవ్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్, ఆలయ ఈవో అంజనాదేవితో కలిసి మంత్రి జూపల్లి ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. బాసర ఆలయ అభివృద్ధికి రూ.190 కోట్లతో మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
వైద్య సౌకర్యాల విస్తరణ..
బాసరలో రూ.5.75 కోట్ల వ్యయంతో నిర్మించే 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి మంత్రి జూపల్లి శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, నారాయణరావు పటేల్, వేణుగోపాలాచారితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.