
మునిగిన మొక్కజొన్న పంటను చూపుతున్న రైతు దేవన్న
ఏటా పంటలు నష్టపోతున్నా అందని పరిహారం
సర్వేలు చేసి నివేదికలు పంపుతున్న అధికారులు
ఫసల్ బీమా లేక నష్టపోతున్న అన్నదాత..
రాష్ట్ర ప్రభుత్వం హామీపైనే ఆశలు
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో ప్రతి ఏటా అతివృష్టి కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగి రైతులు నష్టపోతున్నారు. కొన్ని పంటలు ప్రారంభ దశలోనే దెబ్బతింటుండగా, కొన్ని పంటలు కోత సమయంలో వర్షాలు కురవడంతో రైతుల ఆశలు ఆవిరి చేస్తున్నాయి. తాజాగా పక్షం రోజుల క్రితం కురిసిన వర్షాలతో సుమారు 910 ఎకరాల్లో నష్టం పంటలు దెబ్బతిన్నాయి. గత నెల 27 నుంచి మళ్లీ కురిసిన భారీ వర్షాలు 18,420 ఎకరాల్లో పంటలను ధ్వంసం చేశాయని జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ అంచనాల కంటే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని రైతులు చెబుతున్నారు.
పరిహారం గాలిలో దీపం..
పంట నష్టం సంభవించిన ప్రతిసారీ వ్యవసాయ శాఖ అధికారులు సర్వే నిర్వహించి, నివేదికలను ప్రభుత్వానికి పంపుతున్నారు. గతేడాది కూడా ఇలాంటి నివేదికలు సమర్పించినప్పటికీ, రైతులకు ఎటువంటి పరిహారం అందలేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుండటం రైతులకు తీవ్ర నిరాశను కలిగిస్తోంది. పంట నష్టం జరిగిన సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాల్సి ఉన్నప్పటికీ, అది గాలిలో దీపంలా మిగిలిపోయింది.
ఫసల్ బీమా పథకం అమలు కాక..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, అతివృష్టి, అనావృష్టి వంటి సమయాల్లో రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రూపొందించబడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకం ద్వారా రైతులు లబ్ధి పొందేవారు. ఈ పథకం కింద పత్తికి వాతావరణ ఆధారిత బీమా, వరి, సోయా వంటి పంటలకు గ్రామ యూనిట్ ఆధారంగా, ఇతర పంటలకు మండల యూనిట్ ఆధారంగా పరిహారం అందించేవారు. బీమా ప్రీమియంలో రైతులు 50%, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 25% చొప్పున భరించేవి. అయితే, 2018–19 నుంచి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేయడంతో రైతుల పంటలకు రక్షణ లేకుండా పోయింది.
హామీకే పరిమితమైన అమలు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఫసల్ బీమా పథకాన్ని తిరిగి అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో, వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఆర్థిక సహాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పథకం అమలులో ఉంటే, ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు గణనీయమైన ఆర్థిక ఊరట లభించేదని రైతులు అభిప్రాయపడుతున్నారు.
పంటల బీమా అమలు చేయాలి..
రైతులు సాగు చేస్తున్న పంటల కు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించాలి. రైతులు ఆరుగాలం కష్టపడి అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తే విపత్తుల కారణంగా నష్టం వాటిల్లుతోంది. రైతులు సాగు చేసిన పంటలకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించి బీమా కల్పిస్తే సాగుపై భరోసా కలుగుతుంది.
– గురజాల సాయన్న, రైతు, కుంటాల
పంటల వారీగా నష్టం వివరాలు..
పంట రకం; రైతులు; ఎకరాలు
వరి; 4,031; 5,982
పత్తి; 2,486; 3,840
సోయా; 3,569; 6,286
మొక్కజొన్న; 1,552; 1,885
పసుపు; 905; 1,062
ఆయిల్‌పామ్; 149; 326
కూరగాయలు; 88; 109
కందులు; 24; 0
ఈ ఖరీఫ్‌లో ఇప్పటి వరకు జిల్లాలో పంటం వివరాలు
నష్టపోయిన రైతులు; 12,804
గ్రామాలు; 411
మొత్తం పంట నష్టం; 19,530 ఎకరాలు
ఈ చిత్రంలో మునిగిన మొక్కజొన్న పంటను చూపుతున్న రైతు దేవన్న. లక్ష్మణచాంద మండలం పీచర గ్రామ దేవన్న 1.5 ఎకరాల చేను ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగడంతో పూర్తిగా కొట్టుకుపోయింది. పంటల బీమా లేదు. ప్రభుత్వం ఆదుకుంటామని ప్రకటించినా ఇప్పటి వరకు ఎంత సాయం ఇస్తామో స్పష్టత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.