
గ్రామ పాలనలో కొత్త అధ్యాయం
నిర్మల్‌చైన్‌గేట్:తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ పాలనలో పారదర్శకత, శాఖల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు గ్రామ పాలనాధికారుల (జీపీవో) వ్యవస్థను ప్రవేశపెట్టింది. జిల్లా నుంచి 103 మంది జీపీవోలు ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. ఈ నెల 11న కలెక్టర్ సమక్షంలో పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించి, మెరిట్ ఆధారంగా క్లస్టర్ల వారీగా పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. పూర్వపు వీఆర్‌వోలు, వీఆర్‌ఎలకు అవకాశం కల్పించారు. రెండు దఫాల్లో నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులై 103 మంది జీపీవోలుగా ఎంపికయ్యారు.
పటేల్–పట్వారీ నుంచి జీపీవో వరకు..
తెలంగాణలో గ్రామీణ పాలన వ్యవస్థ గతంలో అనేక మార్పులకు లోనైంది. జీపీవోల నియామకం ఈ పరిణామంలో కొత్త అధ్యాయం. నిజాం పాలనలో ఉన్న పటేల్–పట్వారీ వ్యవస్థ గ్రామీణ ప్రజలకు ఇబ్బందులను కలిగించింది. 1983లో ఎన్టీ.రామారావు ఈ వ్యవస్థను రద్దు చేశారు. 1983 నుంచి 2003 వరకు గ్రామ కార్యదర్శులు రెవెన్యూ, పంచాయతీ వ్యవస్థలను నిర్వహించారు. 2004లో వైఎస్. రాజశేఖరరెడ్డి వీఆర్‌వో వ్యవస్థను ప్రవేశపెట్టారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థలో అవినీతి ఆరోపణలతో దానిని రద్దు చేసి, మండల స్థాయిలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, తహసీల్దార్‌లపై ఆధారపడింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ స్థాయిలో సమర్థవంతమైన పాలన కోసం జీపీవో వ్యవస్థను తీసుకొచ్చింది.
గ్రామీణ పాలనలో కీలక బాధ్యతలు
జీపీవోలు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌లో నియమితులై, 11 రకాల బాధ్యతలను నిర్వర్తిస్తారు. వీటిలో భూ నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు, శాఖల సమన్వయం ప్రధానమైనవి. గ్రామ ఖాతా నిర్వహణ, పహణీల నమోదు, రెవెన్యూ రికార్డుల నవీకరణ, లావాదేవీలు, ఆసైన్, దేవాదాయ, వక్ఫ్ భూముల నిర్వహణ, భూ సర్వే సేవలు. వరదలు, ఇతర విపత్తుల సమయంలో నష్టం అంచనా, సహాయక చర్యలు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించడం, విచారణ నిర్వహణ. జనన–మరణ రిజిస్ట్రేషన్, ఎన్నికల సమయంలో సహకారం, వివిధ శాఖల మధ్య సమన్వయం. ఈ వధులు నిర్వహిస్తారు.
159 క్లస్టర్ల ఏర్పాటు..
జిల్లాలో 400 రెవెన్యూ గ్రామాలను 159 క్లస్టర్లుగా విభజించారు, అయితే ఎంపికై న జీపీవోల సంఖ్య 103 మాత్రమే. ప్రతీ క్లస్టర్‌లో బహుళ గ్రామాలను చేర్చి, జీపీవోల ద్వారా సమర్థవంతమైన పాలనను నిర్ధారించే ప్రయత్నం జరుగుతోంది. జీపీవోలకు తోడుగా రెవెన్యూ శాఖలోని రికార్డు అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లను నియమించనున్నారు. ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక జీపీవోను నియమించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
మొదటి విడత జీపీవో దరఖాస్తు
చేసుకున్న వారు 151
అర్హులు 105
పరీక్ష రాసినవారు 96
పాస్ అయిన వారు 61
రెండో విడత దరఖాస్తు చేసుకున్నవారు 75
అర్హులు 55
పరీక్ష రాసిన వారు 37
మొత్తం క్లస్టర్లు 159
జీపీవో పరీక్ష పాస్ అయినవారు 103
జిల్లాలో మొత్తం వీఆర్వోలు 96
వివిధ శాఖలలో భర్తీ అయిన వీఆర్వోలు 93
ఇంకా రిపోర్టు చేయకుండా ఉన్న వీఆర్వోలు 3
మొత్తం వీఆర్‌ఏలు 748
మరణించిన వీఆర్‌ఏలు 12
డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయిన వీఆర్‌ఏలు 60