
రవాణా ‘షాక్’
● సర్వీస్ చార్జీలు భారీగా పెంపు ● వాహన యాజమాన్య బదిలీ చార్జి రెట్టింపు ● సోమవారం నుంచే పెంచిన చార్జీలు అమలు ● జిల్లా వాహనదారులపై అదనపు భారం
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ రవాణా శాఖ చడీ చప్పుడు లేకుండా వాహనదారులకు షాక్ ఇచ్చింది. భారీగా సర్వీస్ చార్జీలు పెంచింది. పెంచిన చార్జీలను సోమవారం నుంచే వసూలు చేస్తోంది. దీంతో వాహనదారులు ఖంగుతిన్నారు. 2017 తర్వాత మొదటిసారిగా సర్వీస్ చార్జీలు పెంచింది. ముందస్తు ప్రకటన లేకుండానే పెంచిన చార్జీలు వెబ్‌సైట్‌లో అప్‌డేట్ అయ్యాయి. లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ టెస్ట్, వాహన రిజిస్ట్రేషన్, యాజమాన్య బదిలీ వంటి సేవల ఫీజులు గణనీయంగా పెరిగాయి.
రెట్టింపు ఆదాయమే లక్ష్యంగా..
రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ ఆదాయాన్ని రె ట్టింపు చేసే లక్ష్యంతో ఈ ఫీజు సవరణ చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలోని చించోలి(బి) సమీపంలోని ఆర్టీఏ కార్యాలయంలో రోజువారీ 70 డ్రైవింగ్ లైసెన్స్‌లు, 60 వరకు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్ల జారీ జరుగుతాయి. సుమారు 150 వాహనాలకు సంబంధించిన లావాదేవీలు జరుగుతాయి. కొత్త చార్జీలతో ఈ లావాదేవీల ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
అమల్లోకి పెరిగిన చార్జీలు..
పెంచిన సర్వీస్ చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. 2017 తర్వాత ఇప్పుడు పెంచడం జరిగింది. అన్ని రకాల రిజిస్ట్రేషన్స్‌తోపాటు లైసెన్స్, పర్మిట్, ఫిట్‌నెస్ అన్నింటిపై చార్జీలు పెరిగాయి. వాహనదారులు పెరిగిన సర్వీస్ చార్జీల ప్రకారం రవాణా సేవలు పొందాల్సి ఉంటుంది. – పి.దుర్గాప్రసాద్, ఆర్టీవో, నిర్మల్
సవరించిన చార్జీలు ఇవీ..
● ద్విచక్ర వాహనం లెర్నింగ్ లైసెన్స్: రూ.335 నుంచి రూ.440కి పెరిగింది.
● ఫోర్ వీల్ లెర్నింగ్ లైసెన్స్: రూ.450 నుంచి రూ.585కి..
● పర్మనెంట్ లైసెన్స్ డ్రైవింగ్ టెస్ట్: రూ.1,035 నుంచి రూ.1,135కి..
● వాహన యాజమాన్య బదిలీ: రూ.935 నుంచి రూ.1,805కి..
● హైపోథికేషన్ ఫీజు : రూ.2,135 నుంచి రూ.3,135కి...
● రుణ బదిలీ ఫీజు: రూ.2,445 నుంచి రూ.2,985కి..
● ఆటోరిక్షా డ్రైవింగ్ టెస్ట్: రూ.800 నుంచి రూ.900కి పెరిగాయి.
ఈ ఛార్జీలు వాహన ధర ఆధారంగా కూడా మారుతాయి. ఖరీదైన వాహనాలకు సేవా రుసుము మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ ఫీజు పెంపుతో వాహనదారులపై అదనపు భారం పడింది. ఎలక్ట్రిక్ వాహనాలకు 100% రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నప్పటికీ, సాధారణ వాహనదారులపై చార్జీలు గణనీయంగా పెంచింది. ఆర్టీఏ కార్యాలయాల్లో సౌకర్యాల కొరత ఆందోళన కలిగిస్తోంది.

రవాణా ‘షాక్’