
‘మధ్యాహ్నం’ వంటకు ఎల్‌పీజీ
● సిలిండర్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం ● తొలగిపోనున్న కట్టెల పొయ్యి కష్టం ● జిల్లాలో 830 ఏజెన్సీలు
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సర్కార్ చర్యలు చేపడుతోంది. విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్‌లు, రెండు జతల యూనిఫామ్‌లు అందించింది. మధ్యాహ్న భోజన చార్జీలు పెంచింది. వంట తయారీకి కొత్త పాత్రలు అందించింది. ఇదే సమయంలో కట్టెల పొయ్యిపై వంట చేస్తూ ఇబ్బంది పడుతున్న ఏజెన్సీల కష్టాలు తొలగించాలని నిర్ణయించింది. మధ్యాహ్న భోజనం తయారు చేసే ఏజెన్సీలకు ఎల్పీజీ సిలిండర్లను అందించాలని నిర్ణయించింది. దీంతో కట్టెల పొయ్యి కష్టాలు తీరనున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ఎల్పీజీ సిలిండర్లు లేని పాఠశాలలను గుర్తించారు. త్వరలో అన్ని పాఠశాలలకు ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది.
జిల్లాలో ఇలా..
నిర్మల్ జిల్లాలో 577 ప్రాథమిక, 89 ప్రాథమి కోన్నత, 164 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొ త్తం 830 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. వీటిలో 365 పాఠశాలల్లో ఇప్పటికే ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా, మిగిలిన 465 పాఠశాలల కు సిలిండర్లు అందించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆగస్టు 15 నాటికి సిలిండర్లు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
పొగ, ఇబ్బందుల నుంచి ఉపశమనం
కట్టెల పొయ్యిలపై వంట చేయడానికి వర్షాకాలంలో వంట కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగతో విద్యార్థులకు కూడా అసౌకర్యం కలుగుతోంది. ఎల్పీజీ సిలిండర్ల పంపిణీతో ఈ సమస్యలు తొలగనున్నాయి. వంట ప్రక్రియ సులభతరం కానుంది. కార్మికులు, విద్యార్థుల ఆరోగ్యానికి దోహదపడుతుంది.
జిల్లా సమాచారం....
ప్రాథమిక పాఠశాలలు 577
ప్రాథమికోన్నత పాఠశాలలు 89
ఉన్నత పాఠశాలలు 164
మొత్తం పాఠశాలలు 830
మొత్తం ఏజెన్సీలు 830
ఎల్పీజీ కనెక్షన్ ఉన్న పాఠశాలలు 365
ఎల్పీజీ కనెక్షన్ లేని పాఠశాలలు 465