తొలి ధీర వనిత నాగనిక విజయగాథలు ఎన్నెన్నో!

Women Day 2021 Satavahana Queen Naganika Special Story - Sakshi

శాతకర్ణి భార్య విజయగాథలు ఎన్నో

తన పేరుపై నాణెం వేయించిన తొలి మహిళ 

అశ్వమేధ యాగంతో ధైర్యాన్ని చాటిందీ ఆమెనే

సాక్షి, హైదరాబాద్‌:  ధీర వనితలు అనగానే చరిత్ర పుటల్లో రాణి లక్ష్మీబాయి, రుద్రమదేవి లాంటి వారి పేర్లు కనిపిస్తాయి. వారి వీరగాథలు తెరలు తెరలుగా కదలాడుతాయి. కానీ చరిత్రకు సజీవ సాక్ష్యాలు కనిపించటం మొదలైన తర్వాత తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని భావి తరాల మహిళలకు బాట చూపిన మహిళ నాగనిక. దేశంలో మూడొంతుల ప్రాంతాన్ని అప్రతిహతంగా ఏలిన శాతవాహన వంశానికి చెందిన ధీశాలి నాగనిక. శాతవాహన రాజు శాతకర్ణి భార్య. మూడు శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన శాతవాహన సింహాసనాన్ని అంతే గంభీరంగా అధిష్టించి ఏలిన చక్రవర్తి శాతకర్ణి. ఆయన పాలనకు కూడా అంతే మంచి పేరుంది.

అయితే మహారాష్ట్రలోని పుణే ఆవల నానేఘాట్‌ గుహలో వెలుగు చూసిన ఓ శాసనం మహిళల ధీరత్వానికి నిలువుటద్దం. అది నాగనిక వేయించిన శాసనం. శాతకర్ణి మరణించాక రాజ్యభారాన్ని ఆమెనే చూసుకున్నారని చరిత్రకారులు భావిస్తుంటారు. కానీ దానిని రుజువు చేసే ఆధారాలు పెద్దగా లేవు. కానీ నానేఘాట్‌ శాసనాన్ని నాగనిక వేయించటం ఆమె పాలనను బలపరుస్తోంది. ఈ శాసనంలో ఆమె శాతవాహన తొలి చక్రవర్తి చిముకుడు, తన భర్త శాతకర్ణి, కుమార భాయ, తన తండ్రి త్రణకయిరో, కుమార హకుసిరిల ప్రతిమలు, వారి కీర్తిని చెక్కించారు. 

ఆమె కీర్తికి తార్కాణం వెండి నాణేలు..
సాధారణంగా తమ పాలనకు గుర్తుగా చక్రవర్తులు, రాజులు నాణేలు చెలామణిలోకి తీసుకొస్తారు. ఏ ప్రాంతాన్నైనా ఓడించి తన పరిధిలోకి తెచ్చుకుంటే.. అక్కడ అప్పటివరకు ఉన్న నాణేలను పక్కనపెట్టేసి, తమ పేరు, గుర్తుతో ఉండే సొంత నాణేలు వేయిస్తారు. అప్పట్లో నాణేలకు అంత ప్రాధాన్యం ఉండేది. తమ పేర నాణెం వేయిస్తే.. ఆ ప్రాంతంలో తమ మాటకు ఎదురు లేదన్నట్టుగా భావించేవారు. అయితే చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ పేరుతో ఉన్న నాణెం జున్నూరు ప్రాంతంలో లభించింది. అది శాతవాహనుల వెండి నాణెం. దానిపై నాగనిక పేరు ఉంది. తన భర్త శాతకర్ణి పేరు కూడా అందులో వేయించింది.

నాగనిక పాలించారనడానికి ఇదే గుర్తు అని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. ఇక పెద్దపెద్ద చక్రవర్తులు చేసే అశ్వమేధ యాగాన్ని కూడా ఆమె నిర్వహించినట్టు ఆ నాణేలు చెబుతున్నాయి. యాగ అశ్వం ఎంత దూరం వెళితే అంతవరకు తమ రాజ్యంగా పేర్కొనేవారు. ఇలా అశ్వమేధ యాగం నిర్వహించిన వారు.. తమ రాజ్య నాణేలపై గుర్రం బొమ్మను ముద్రిస్తారని చరిత్ర చెబుతోంది. నాగనిక పేరుతో దొరికిన కొన్ని నాణేలపై అశ్వం గుర్తు కనిపించటంతో ఆమె అశ్వమేధయాగం చేశారని భావిస్తున్నారు. మొత్తంగా సువిశాల శాతవాహన సామ్రాజ్యాన్ని ఆమె ధైర్యంగా ఏలారన్నది చరిత్రకారుల మాట. ఈ లెక్కన చరిత్రలో నిలిచిన ధీర వనితల్లో అమెది ముందు వరసే.

చదవండి: కష్టాలను భరించి.. కరోనాను ఎదిరించి.. నారీ వారియర్

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top